- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడవి బిడ్డలకు అండగా మంత్రి సీతక్క..
"సంస్కృతిని మరిచి ఎర్రమందుకు అలవాటు పడొద్దు" అంటూ గిరిజనులకు మంత్రి సీతక్క పిలుపు ఇచ్చారు.

దిశ, గంగారం: గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మారుమూల ఏజెన్సీ గిరిజన గ్రామం మర్రిగూడెం రైతు వేదికలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ స్నేహ శబారీష్, జిల్లా అటవీశాఖ అధికారి విశాల్ బత్తుల తదితర జిల్లా అధికారులతో కలిసి మంత్రి సీతక్క ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు. భూమి సమస్యలు, పోడు భూములు, ఆసరా పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, తాగునీరు, విద్యుత్, గ్రామీణ రహదారులు, ఆరోగ్య సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే..
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజా దర్బార్‌లో వచ్చిన ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా పాలనను ప్రజల గడపకు చేర్చడం జరుగుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల పనులు, సీసీ రోడ్లు, చెక్‌డ్యాములు, గ్రామీణ రహదారులు, విద్యుత్ సౌకర్యాల కల్పన వంటి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, స్వయం సహాయక సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే ప్రభుత్వ సంకల్పమన్నారు.
సంస్కృతిని మరిచి ఎర్రమందుకు అలవాటు పడొద్దు
ప్రజా దర్బార్ అనంతరం గంగారం మండలంలోని మహాదేవునిగూడెం ఆశ్రమ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గిరిజన కార్పొరేషన్, డీఆర్‌డీఓ, జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇప్పపువ్వు లడ్డు తయారీ శిక్షణ కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పపువ్వు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ఇప్పపువ్వులో ఎన్నో పోషక, ఔషధ గుణాలు ఉన్నాయని, దాని ద్వారా లడ్డూలు, నూనె, పౌడర్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి మంచి ఆదాయం పొందవచ్చన్నారు. "మన పూర్వీకులు ఇప్పపువ్వును జీవనాధారంగా మలుచుకున్నారు. కానీ నేడు కొందరు తమ సంస్కృతిని మరిచి ఎర్రమందుకు అలవాటు పడుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఇప్పపువ్వు వంటి సంపదను ఉపాధి వనరుగా మలుచుకుని గిరిజన యువత, మహిళలు ఆర్థికంగా ఎదగాలి" అని మంత్రి పిలుపునిచ్చారు. ఇప్పపువ్వు లడ్డు తయారీ కేంద్రం ద్వారా గిరిజన మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ లభిస్తుందని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు.
372 దరఖాస్తులు స్వీకరణ.. అర్హులకు న్యాయం చేస్తాం : కలెక్టర్
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ.. ప్రజా దర్బార్‌లో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలకు వెంటనే పంపించి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత ప్రజా దర్బార్‌లలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతగా పరిష్కరించామని, రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇప్పటికే ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేసినట్లు చెప్పారు. ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్‌లో మొత్తం 372 దరఖాస్తులు స్వీకరించినట్లు వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేయడంతో పాటు పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి సీతక్క సన్మానించారు. ఈ కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగా కళ్యాణి, డీఆర్‌డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రూప్ సింగ్, సుంకరబోయిన మొగిలి, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






