14 ఏళ్ల నిరీక్షణ ఫలించింది.. గాంధీలో ఐవీఎఫ్ ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గర్భిణీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-05 16:27:23  IST  )

పద్నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడింది.. ఆ దంపతుల జీవితంలో ఎనలేని ఆనందం వెల్లివిరిసింది.

14 ఏళ్ల నిరీక్షణ ఫలించింది.. గాంధీలో ఐవీఎఫ్ ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గర్భిణీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పద్నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడింది.. ఆ దంపతుల జీవితంలో ఎనలేని ఆనందం వెల్లివిరిసింది. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రైతు గువ్వల సతీష్, నవీన దంపతులకు వివాహమై 14 ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకపోవడంతో, వారు హైదరాబాద్‌లోని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి ఐవీఎఫ్ కేంద్రాన్ని ఆశ్రయించారు. గాంధీ వైద్యుల పర్యవేక్షణలో ఉచితంగా పొందిన ఐవీఎఫ్ చికిత్స విజయవంతమై, నవీన శుక్రవారం 3 కేజీల ఆరోగ్యంగా ఉన్న ఆడబిడ్డకు జన్మనిచ్చారు. గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌లో ఇప్పటివరకు జరిగిన నాలుగో విజయవంతమైన ప్రసవం ఇది. నిరుపేదలకు కూడా అత్యాధునిక సంతాన లేమి చికిత్సలను అందుబాటులోకి తేవాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ఈ విజయం ఒక నిదర్శనంగా నిలిచింది.

ఆ దంపతుల నవ్వుల్లోనే ప్రభుత్వ విజయం- మంత్రి దామోదర్ రాజనర్సింహ

గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ ద్వారా నవీన, సతీష్ దంపతులకు సంతానం కలగడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తల్లిదండ్రులైన నవీన-సతీష్ దంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆ పండంటి ఆడబిడ్డ ఆరోగ్యంగా, సంతోషంగా పెరగాలని ఆకాంక్షించారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే ఐవీఎఫ్ చికిత్సను, పేద ప్రజల కోసం గాంధీ ఆసుపత్రిలో ఉచితంగా అందించి, విజయవంతం చేసిన వైద్య బృందాన్ని అభినందించారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, అత్యాధునిక వైద్య సేవలను చేరువ చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆ దంపతుల ముఖాల్లో చూసిన ఆనందమే తమ ప్రభుత్వ విజయానికి నిజమైన నిదర్శనమని పేర్కొన్నారు.

Next Story