- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకే జలసిరి కార్యక్రమం: మంత్రి సీతక్క
మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సీతక్క సూచించారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: వర్షపు ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జలసిరి కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత, ప్రతి పొలంలో పొలం గుంత, చెరువుల వద్ద ఊట గుంత ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గ్రామాలలోని సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆమె సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం, జలసిరి కార్యక్రమం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ వి బి జి రామ్ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో నీటిని ఉడిసిపట్టే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్నారు. జిల్లాలో 50వేల ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, మహిళా సంఘాలలోని మహిళలు నీటిని ఆదా చేసుకుంటూ కుటుంబ స్త్రీ, ఆదాయశ్రీ గా మార్చుకోవాలని సూచించారు.
ఉపాధి కల్పించే లక్ష్యంతో..
గ్రామాలలోని సర్పంచులు సత్వరమే గ్రామసభలు ఏర్పాటు చేసుకుని చేపట్టే కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకోవాలని, రాబోయే తరం వారికి ఎలాంటి నీటి కొరత ఉండకుండా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే వివో భవనాలు, గ్రామపంచాయతీ, అంగన్వాడి కేంద్రాల భవన నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, మరో 318 రకాల పనులు చేపట్టడానికి ఈ పథకంలో అవకాశం ఉందని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద రాష్ట్రంలో ఆరువేల కోట్ల రూపాయలతో పనులు చేయడానికి అవకాశం ఉందని, 5 లక్షల మంది కూలీలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన లబ్ధిదారులు నేటికీ ఇంటి నిర్మాణ పనులు చేపట్టని పక్షంలో సర్పంచులు చోరువ చూపి ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, మంజూరైన ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయితేనే నూతన ఇండ్ల నిర్మాణానికి అనుమతులు వస్తాయని వివరించారు.
ములుగు నియోజకవర్గంలో ఇప్పటికే..
మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర లక్షల మంది ఒంటరి, వితంతువులకు పెన్షన్ల ను ఆగస్టు 15వ తేదీన ప్రారంభించబోతున్నదని అన్నారు. జిల్లాలు చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ముఖ్యంగా పండ్ల మొక్కలను ఎక్కువ శాతం నాటాలని సూచించారు. ములుగు నియోజకవర్గంలో ఇప్పటికే సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేశామని, రానున్న రోజులలో మరో పథకం ద్వారా నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. జి బి జి రామ్ ఉపాధి హామీ పథకం ద్వారా గతంలో సంవత్సర కాలంలో ఏడున్నర కోట్ల పని దినాలను కల్పించగా, నేడు రెండున్నర నెలలలోనే ఏడున్నర కోట్ల పని దినాలను కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశించిన సమయంలోనే అధికారులు పూర్తి చేయాలని, ఆయా పనులపై ప్రజా ప్రతినిధులు నిరంతరం పరిశీలించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ భాను రవిచందర్, పిఎసిఎస్ చైర్మన్ బొక్క సత్తిరెడ్డి, ఆత్మ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ కొమురయ్య, గ్రామాల సర్పంచులు, మహిళా సంఘాల మహిళలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.






