- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రత్యేక ప్రజా దర్బార్ నిర్వహణ: మంత్రి సీతక్క
మహిళల ఆర్థిక పురోగతికి కొత్త అవకాశాలు కల్పిస్తామని మంత్రి సీతక్క అన్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని, మహిళల ఆర్థిక పురోగతికి కొత్త అవకాశాలు సృష్టిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్, లింగాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, పలు గ్రామాలలో అంతర్గత రహదారుల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.
మహిళా సంఘాల ద్వారా..
గతంలో అటవీ అనుమతుల కారణంగా నిలిచిపోయిన రహదారి పనులకు అవసరమైన అన్ని అనుమతులు సాధించి పనులను వేగవంతం చేస్తున్నామని, రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో వాగులు, చెరువుల అభివృద్ధికి 70 కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు. ప్రజా దర్బార్‌లో అందిన ప్రతి దరఖాస్తును పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మహిళా సంఘాల ద్వారా చేపలు, పచ్చళ్లు తదితర ఉత్పత్తుల విక్రయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తూ శిక్షణ అందిస్తోందని, అడవి ప్రాంతాల్లో లభించే వనరులను ఆదాయ మార్గాలుగా మలచుకుని కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ములుగు నియోజకవర్గంలో ఇప్పటికే 5 వేలకుపైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, రెండో విడతలో మరో 2 వేల ఇళ్లను కూడా ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు..
అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి దూర ప్రాంతాల ప్రజలు రావాల్సి వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలకు చేరువగా ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, రెండు మూడు గ్రామ పంచాయతీలను సమూహంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రజలకు మరింత సౌలభ్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిబంధనల ప్రకారం మొత్తం నిధుల్లో 60 శాతం కూలీల వేతనాలకు, 40 శాతం నిర్మాణ సామాగ్రికి కేటాయించబడతాయని తెలిపారు. కార్యక్రమాలలో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్‌ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి,సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






