గ్రామ పంచాయతీల నిర్వహణకు రూ. 5 వందల కోట్ల నిధులు మంజూరు: మంత్రి సీతక్క

by Kodari Anjali |

గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని మంత్రి సీతక్క అన్నారు.

గ్రామ పంచాయతీల నిర్వహణకు రూ. 5 వందల కోట్ల నిధులు మంజూరు: మంత్రి సీతక్క
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకంగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం ములుగు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో నూతనంగా ఎన్నికైన ములుగు, వెంకటాపూర్, మల్లంపల్లి, గోవిందరావుపేట మండలాల సర్పంచ్‌లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమ ప్రారంభానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గెస్ట్ హౌస్ ఆవరణలో ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్ తయారీ, తడి చెత్త పొడి చెత్త నిర్వహణ స్టాల్‌లను పరిశీలించారు. అనంతరం ములుగు,మల్లంపల్లి మండలకు చెందిన 75 మంది లబ్ధిదారులకు సీతక్క కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.

పాలకులుగా ఉంటూ సేవకులుగా ప్రజలకు సేవ చేయాలి..

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని, గ్రామాలు అభివృద్ది చెందాలంటే సర్పంచుల పాత్ర కీలకంగా ఉంటుందని, నూతనంగా ఎన్నికైన సర్పంచులకు పంచాయతీ రాజ్ చట్టంపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని, పాలకులుగా ఉంటూ సేవకులుగా ప్రజలకు సేవ చేయాలని అన్నారు. గ్రామాలలో మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందేలా చూడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులకు అందరికీ ఉపయోగపడే పనులకు ఖర్చు చేయాలని, గ్రామ అభివృద్ధిపై పాలక మండలి ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించాలని, ఉపాధి హామీ పథకంలో కార్మికుల సంఖ్య పెంచేలా చూడాలని అన్నారు. సుమారు 500 కోట్ల రూపాయల నిధులను గ్రామ పంచాయతీలకు అందిస్తున్నామని అన్నారు.

వాటిపై స్పష్టమైన అవగాహన కల్పించాలి..

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలి అనే అంశాలపై ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహించడం జరుగుతుందని వివరించారు. సర్పంచులకు మరిన్ని అదనపు బాధ్యతలు కల్పించి బాల్యవివాహాల నిర్మూలన, గ్రామాలలోని అత్యంత పేదరికంలో ఉన్న వారిని గుర్తించడం, మహిళ సంఘాలను ప్రోత్సహించడం, అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. శిక్షణ తరగతులకు విచ్చేసిన నూతన సర్పంచులకు పంచాయతీ రాజ్ చట్టం గూర్చి, సర్పంచుల విధులు వారి బాధ్యతలపై ఐదు రోజులపాటు స్పష్టమైన అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.

Next Story