- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బయ్యారం ఏజెన్సీలో ‘మినీ’ దోపిడీ: ‘పే నియర్ బై’ యాప్‌తో కోట్లలో గోల్‌మాల్!
బయ్యారం మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో మినీ బ్యాంక్ నిర్వాహకులు పే నియర్ బై యాప్‌ల ద్వారా పేదల ఖాతాల్లోని సొమ్మును కొల్లగొడుతున్నారు.

దిశ, బయ్యారం: బయ్యారం మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో ‘పే నియర్ బై’ (PayNearby) యాప్‌ల ద్వారా మినీ బ్యాంకుల పేరిట వినియోగదారుల ఖాతాల నుంచి కోట్లాది రూపాయల సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా కొల్లగొడుతున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని రామచంద్రపురం గ్రామంలోని ఒక మినీ బ్యాంక్ సెంటర్ నిర్వాహకుడు ఈ అక్రమాలకు తెరలేపాడు. బ్యాంకు వినియోగదారులు తమ అవసరాల నిమిత్తం డబ్బులు డ్రా చేసేందుకు వస్తే, వారికి ఖాతాలోని అసలు బ్యాలెన్స్ వివరాలు చెప్పకుండా వేల రూపాయలు కాజేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో నేరుగా బ్యాంకులకు వెళ్లే ఖాతాదారులు, ఇప్పుడు బ్యాంకింగ్ సేవలు గ్రామాలకు విస్తరించడంతో మినీ బ్యాంకులపై ఆధారపడుతున్నారు. చదువుకున్న నిరుద్యోగులకు బ్యాంకులు ఐడీలు ఇచ్చి రూ.1,000 నుంచి రూ.30 వేల వరకు బయోమెట్రిక్ ద్వారా లావాదేవీలు జరిపే అవకాశం కల్పించాయి.
మోసం జరుగుతున్న తీరు ఇలా..
నిరక్షరాస్యులు, వృద్ధులు, వికలాంగులు మరియు రైతులను లక్ష్యంగా చేసుకుని ఈ దోపిడీ సాగుతోంది. ఆధార్ నంబర్ ద్వారా పే నియర్ బై యాప్ ఉపయోగించి, బయోమెట్రిక్ మెషిన్‌పై పలుమార్లు వేలిముద్రలు వేయించుకుంటూ దొంగచాటుగా డబ్బులు డ్రా చేస్తున్నారు. రామచంద్రాపురం, రెడ్యా తండా, కస్తూరి నగరం, మెట్ల తిమ్మాపురం సహా పదికి పైగా గ్రామాల్లోని వందలాది మంది ఖాతాదారులను ఇలా మోసగించినట్లు సమాచారం. రూ.1,000 డ్రా చేస్తే రూ.20 కమిషన్ తీసుకుంటూనే, మరోవైపు బ్యాలెన్స్ తక్కువగా ఉందని నమ్మించి వేల రూపాయలు ఖాతాల నుంచి లాగేస్తున్నారు.
వెలుగులోకి తెచ్చిన బాధితురాలు..
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGVB) ఖాతాదారురాలు గుగులోత్ రాజలి ఈ మోసాన్ని బయటపెట్టారు. ఈ నెల 5న ఆమె రామచంద్రపురం మినీ బ్యాంక్ సెంటర్‌కు వెళ్లగా, నిర్వాహకుడు ఆమె ఖాతాలో కేవలం రూ.7 వేలు ఉన్నాయని చెప్పి, రూ.6 వేలు చేతికిచ్చాడు. అయితే, ఉపాధి హామీ పని ద్వారా తన ఖాతాలో రూ.11 వేలు పడ్డాయని తెలుసుకున్న ఆమెకు అనుమానం వచ్చింది. మరుసటి రోజు బ్యాంకులో విచారించగా, నిర్వాహకుడు రూ.10 వేలు డ్రా చేసినట్లు స్టేట్‌మెంట్ ద్వారా తేలింది. బాధితురాలు తన అల్లుడి ద్వారా నిలదీయగా, నిర్వాహకుడు పొరపాటు జరిగిందని సాకు చెప్పి కాజేసిన రూ.4 వేలు తిరిగి ఇచ్చేశాడు.
క్యూ కడుతున్న ఖాతాదారులు..
ఈ వార్త దావాగ్నంలా వ్యాపించడంతో ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమ ఖాతాలు కూడా ఖాళీ అయ్యాయేమోనన్న భయంతో బయ్యారం, గంధంపల్లి లోని బ్యాంకులు మరియు మినీ సెంటర్ల వద్ద స్టేట్‌మెంట్‌ల కోసం ఖాతాదారులు క్యూ కడుతున్నారు. మండలంలో సుమారు 40 నుంచి 60 మినీ బ్యాంక్ సెంటర్లు ఉండగా, గత పదేళ్లుగా ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బ్యాంకింగ్ సేవలను మరింత సురక్షితం చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.






