- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానుకోటలో విలీన కష్టాలు.!
‘కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడింది’ అనే చందంగా తయారైంది మానుకోట మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు, తండాల పరిస్థితి.

దిశ, మహబూబాబాద్ : ‘కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడింది’ అనే చందంగా తయారైంది మానుకోట మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు, తండాల పరిస్థితి. 26 వార్డులుగా ఉన్న మానుకోట మున్సిపాలిటీ మరో 10 వార్డులను కలుపుకొని 36 వార్డులుగా రూపాంతరం చెందింది. ఈదుల పూసపల్లి, జామండ్లపల్లి, గాంధీపురం, అనంతారం, బేతోల్, రజాల్ పేట, శనిగపురం గ్రామాలతోపాటు వాటి పరిధిలోని తండాలు కలుపుకొని 2019లో మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఆనాటి నుండి నేటి వరకు మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలు, తండాల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. అంతర్గత రోడ్లు, డ్రైనేజీల సమస్యలు పెరిగిపోయాయి. అభివృద్ధి పనులు కుంటుపడి ఉపాధి హామీ పనులు దొరకడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీలో గతంలో ఇంటి పన్ను రూ.300 ఉండేదని ప్రస్తుతం రూ.4వేలకు పెరిగిందని, అయినా సరైన సదుపాయాలు కల్పించడం లేదని వాపోతున్నారు. ఇంటి నిర్మాణాల అనుమతుల్లో తీవ్ర జాప్యం నెలకొంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని, మున్సిపాలిటీలో తాము కొనసాగాలేమని, గ్రామపంచాయతీ పరిధిలోకి మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
మురుగు కంపు.. వెలగని వీధి దీపాలు..
మున్సిపాలిటీల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నామంటూ ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. పారిశుధ్య సిబ్బంది కొరతతో విలీన గ్రామాలు,తండాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. గతంలో నిర్మించిన సైడ్ డ్రైనేజీలు శిథిలావస్థకు చేరగా మురుగు రోడ్లవెంట పరుగులు పెడుతుంది. దోమలు స్వైర విహారం చేస్తుండడంతో విషజ్వరాలతో తండాలు మంచం పడుతున్నాయి. వీధి దీపాలు వెలగడం లేదని, గుంతల రోడ్లలో సైతం కనీసం తట్టెడు మట్టి పొయలేదనే విమర్శలు ఉన్నాయి.
ఉపాధి హామీ కరువు.!..
విలీన గ్రామాల్లో, తండాల్లో ఉపాధి హామీ పనులు లేక కూలీలు అవస్థలు పడుతున్నారు. గ్రామాలుగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు దొరికేవని, మున్సిపాలిటీల్లో కలవడంతో పనుల్లేక వేల మంది కూలీలు ఉపాధికి దూరమయ్యారు. పట్టణాల్లోని కూలీలకు కూడా ఉపాధి హామీ వర్తింపజేయాలని కోరుతున్నారు.
మున్సిపాలిటీ వద్దంటూ ధర్నాలు..
విలీనమై ఐదేళ్లు గడిచినా ఇప్పటివరకు కనీస అభివృద్ధి లేకపోవడంతో విసిగిన ప్రజలు తిరిగి గ్రామపంచాయతీలోనే కలపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. డోర్నకల్ మున్సిపాలిటీ లాంటి చోట్ల ఏకంగా మహిళలు ధర్నా నిర్వహించారు.
వీధి దీపాలు లేవు–షేక్ ఖాదర్, ఆరో వార్డు, బేతోల్ గ్రామం
వీధి దీపాలు ఆరు నెలలుగా వెలగడం లేదు. సరైన డంపింగ్ యార్డు లేకపోవడంతో నేషనల్ హైవే పక్కనే చెత్తాచెదారం వేయాల్సి వస్తుంది. మున్సిపాలిటీలో విలీనమైతే వసతులు పెరగాలి కానీ, కనీస మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారు.
రూ.60కోట్ల నిధులు వచ్చాయి–మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్
మున్సిపాలిటీ అభివృద్ధికి సుమారు 60 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. ఒక్కో వార్డుకు రూ.50 లక్షల చొప్పున కేటాయించి అభివృద్ధి పనుల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల సమస్యలు మా దృష్టికి వచ్చిన వెంటనే స్పందిస్తున్నాం. త్వరలోనే అభివృద్ధి పనులు జరుగుతాయి. వీలిన గ్రామాల సమస్యలు తీరుతాయి.






