గర్భాశయ క్యాన్సర్ నివారించడానికి చర్యలు : ఎమ్మెల్యే సత్యనారాయణ రావు

by Nallavelli.Anjaneyulu |

HPV టీకా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్స‌ర్ బారి నుంచి కాపాడుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.

గర్భాశయ క్యాన్సర్  నివారించడానికి చర్యలు :  ఎమ్మెల్యే  సత్యనారాయణ రావు
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : HPV టీకా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్స‌ర్ బారి నుంచి కాపాడుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో హెచ్‌పీవీ టీకా ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. 14 నుంచి 15 సంవత్సరాలలోపు ఉన్న బాలికలు తప్పనిసరిగా ఈ టీకాను తీసుకోవాలని ఆయన సూచించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నియంత్రణలో ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేస్తుందని పేర్కొన్నారు.

బాలికల ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు అవగాహన పెంచుకొని టీకా వేయించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. జిల్లాలో 14 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల మొత్తం 2425 మంది బాలికలను గుర్తించినట్లు తెలిపారు. వీరందరికీ హెచ్‌పీవీ టీకా అందించే కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ చేపట్టిందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ని ప్రధాన ఆసుపత్రితో పాటు మహాదేవ పూర్, చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా వేస్తారని సంక్షేమ శాఖల అధికారులు, విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించి వాక్సిన్ వేయించాలని సూచించారు. ఫిజిషియ‌న్, పిడియాట్రిష‌న్, అనేస్థీషియా పర్యవేక్షణలో ఆర్యోగ్యం పరీక్షించి తదుపరి వాక్సిన్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ ఛైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, ఉప వైద్యాధికారి డా శ్రీదేవి, డా ఉమాదేవి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Next Story