గంజాయి మత్తులో లారీ డ్రైవర్లపై దాడి

by Elthuri vijay kumar |

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో సోమవారం అర్ధరాత్రి గంజాయి మత్తులో ముగ్గురు యువకులు లారీ డ్రైవర్లపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

గంజాయి మత్తులో లారీ డ్రైవర్లపై దాడి
X

గంజాయి మత్తులో లారీ డ్రైవర్లపై దాడి

– పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు

దిశ, తొర్రూర్: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో సోమవారం అర్ధరాత్రి గంజాయి మత్తులో ముగ్గురు యువకులు లారీ డ్రైవర్లపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక డ్రైవర్ గాయపడ్డాడు. హైదరాబాద్‌ ఉప్పల్ చిలుకానగర్‌కు చెందిన తోల్ల అభిలాష్ తన క్లీనర్‌తో కలిసి డి‌సి‌ఎం వాహనంలో స్పేర్ పార్ట్స్ తీసుకుని ఝార్ఖండ్ వెళ్తుండగా, మరో లారీ డ్రైవర్ పెద్దపాటి రాంబాబు మహారాష్ట్ర నుంచి నూజివీడుకు కోళ్ల దాణా తీసుకెళ్తున్నాడు. రాత్రి రెండు గంటల సమయంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి దుబ్బ తండా వద్ద ముగ్గురు యువకులు వాహనాలను అడ్డగించి డ్రైవర్లను లైసెన్స్, పర్మిట్ చూపాలని, లేకపోతే డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. డ్రైవర్ రాంబాబు ప్రతిఘటించడంతో రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం లారీ అద్దాలను పగలగొట్టి, హైవేపై గందరగోళం సృష్టించారు. భయంతో బాధితులు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి 100 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించారు. వెంటనే తొర్రూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉండగా, అతడి కోసం గాలింపు కొనసాగుతోంది. బాధిత డ్రైవర్లు మాట్లాడుతూ, “తొర్రూర్ మీదుగా ఎన్నోసార్లు ప్రయాణించామని, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని అన్నారు. గంజాయి మత్తులో దాడి చేయడంతో మా వాహనం ధ్వంసమైంది. మాకు న్యాయం జరగాలి” అని వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story