కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి

by Ratna Kumari |

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి
X

దిశ, వరంగల్ బ్యూరో : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కొలువుల కోసం కొట్లాట పేరిట హన్మకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మా ఉద్యోగాలు మాకే కావాలి అనే బలమైన నినాదంతోనే నాడు కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారన్నారు. కేవలం రాష్ట్రాన్ని సాధించడమే కాదు, తెలంగాణ యువతకు 95 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే 95 శాతం స్థానికత దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు.

తెలంగాణ రాష్ట్రం రావడం వల్లే కాజీపేటకు ఈ కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఇక్కడ పరిశ్రమలు రావాలని ముఖ్యంగా మన స్థానికులకు ఉపాధి ఉద్యోగాలు దొరకాలని మనం కోరుకున్నామన్నారు. కానీ ఈరోజు ఫ్యాక్టరీ వచ్చినా.. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. నాడు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం.. దేవాదాయ శాఖకు చెందిన 150 ఎకరాల భూములను హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకొని మరీ కోచ్ ఫ్యాక్టరీ కోసం ఇచ్చిందన్నారు. కేవలం భూములు ఇవ్వడమే కాదు కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం నాడు బీఆర్ఎస్ ఎంపీలు రైల్వే మంత్రిని కలిసి, పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారన్నారు. ఆనాడు దేశంలో కోచ్ ఫ్యాక్టరీల అవసరమే లేదని మనకు సమాధానం చెప్పిన బీజేపీ ప్రభుత్వం.. ఆ తర్వాత అస్సాం, లాతూర్ మహారాష్ట్రలలో కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసి తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపిందన్నారు.

కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ ఫ్యాక్టరీ పెడతామన్నారన్నారు. అసలు ఇప్పుడు ఇక్కడ కడుతున్నది వ్యాగన్ ఫ్యాక్టరీనా? లేక కోచ్ ఫ్యాక్టరీనా? అన్న దానిపై ఇప్పటివరకు కనీసం గెజిట్ నోటిఫికేషన్ కూడా రాలేదన్నారు. వెంటనే దీనిపై స్పష్టతనిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని లాతూర్ వ్యాగన్ ఫ్యాక్టరీలో 70 శాతం స్థానికులకే రిజర్వేషన్ ఇచ్చారన్నారు. మరి తెలంగాణలో మన కాజీపేట యువతీ యువకులకు ఎందుకు ఆ రిజర్వేషన్ కల్పించడం లేదని ప్రశ్నించారు. మహారాష్ట్రకు ఒక చట్టం, తెలంగాణకు ఒక చట్టం ఉంటుందా? అని అన్నారు.రాష్ట్ర ప్రజలు బీజేపీకి 8 మంది, కాంగ్రెస్ కు 8 మంది ఎంపీలను గెలిపిస్తే వాళ్లు తెలంగాణకు చేస్తున్న నిర్వాకం ఇదేనా అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీ స్థానికుల ఉద్యోగాల గురించి ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారు. కేంద్ర మంత్రులు వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేస్తామని అంటున్నారన్నారు.


భూములు ఇచ్చిన నిర్వాసితులకు, స్థానికులకు లాతూర్ తరహాలో 70 శాతం రిజర్వేషన్ కల్పించకుండా ప్రారంభోత్సవానికి వస్తే.. బిడ్డా మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా నిలదీస్తామన్నారు. ఒకప్పుడు దేశంలోనే ప్రసిద్ధి గాంచిన కాజీపేట జంక్షన్ ప్రాధాన్యత రోజురోజుకూ తగ్గిపోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంకు రైల్వే జోన్ ఇచ్చినట్లుగానే, కాజీపేటను కూడా తక్షణమే రైల్వే జోన్ గా ప్రకటించాలన్నారు. బడే భాయ్.. ఛోటే భాయ్ అంటూ మాట్లాడే రేవంత్ రెడ్డి.. కాజీపేట జంక్షన్ ను రైల్వే జోన్ గా ఎందుకు చేయించడం లేదన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడగడం లేదన్నారు. కాంగ్రెస్ ఎంపీలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదని తాను చేసిన అవినీతిని కేంద్రం బయటపెడుతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నారా అని ప్రశ్నించారు. కాజీపేటలో స్థానికుల ఉద్యోగాల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. ఈ అంశంపై రాజ్యసభలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శాషణమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, రాజయ్య మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, సుదర్షన్ రెడ్డి, శంకర్ నాయక్, అరూరి రమేష్ పాల్గొన్నారు.

Next Story