ఉప్పల్‌ భగాయత్‌లో బైక్ రేసర్ల హల్‌చల్.. పోలీసుల ఉక్కుపాదం!

by Jakkula.Mamatha |

ఉప్పల్ భగాయత్ ఫేజ్-2 ప్రాంతంలో బైక్ రేసర్లు మరోసారి రెచ్చిపోతున్నారు

ఉప్పల్‌ భగాయత్‌లో బైక్ రేసర్ల హల్‌చల్.. పోలీసుల ఉక్కుపాదం!
X

దిశ,ఉప్పల్: ఉప్పల్ భగాయత్ ఫేజ్-2 ప్రాంతంలో బైక్ రేసర్లు మరోసారి రెచ్చిపోతున్నారు. నిర్మానుష్యంగా ఉండే అంతర్గత రహదారులను ఎంచుకుని యువకులు అధిక వేగంతో బైకులు నడుపుతూ, ప్రమాదకర స్టంట్లు చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి.ఈ ఫిర్యాదులపై స్పందించిన ఉప్పల్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు.గత శనివారం ముగ్గురు, సోమవారం ఇద్దరని బైక్ రేసర్లను పట్టుకుని వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించారు.

18 సంవత్సరాల లోపు యువకులే..

ఉప్పల్ బాగాయత్ ఫేజ్-2లో బైక్ రేసర్లు, స్టంట్లు చేసే వారిలో 18 సంవత్సరాల లోపు యువకులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.అవగాహన లేకపోవడం, సరదాగా చేసే విన్యాసాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి.పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని పలువురు అంటున్నారు.

ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ రామలింగారెడ్డి వివరణ..

ప్రమాదకర విన్యాసాలు యువత ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తాయని సీఐ రామలింగారెడ్డి హెచ్చరించారు. పిల్లలు చట్టాలను పాటించేలా తల్లిదండ్రులు అవగాహన కల్పించి, బైక్‌లను బాధ్యతాయుతంగా వినియోగించేలా పర్యవేక్షించాలని సూచించారు. స్థానికుల భద్రతకు భంగం కలిగించేలా రోడ్లపై రేసింగ్‌లు, స్టంట్లు చేసే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని సీఐ హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. బైక్ రేసింగ్‌లు, ప్రమాదకర విన్యాసాలు చేసే వారిపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Next Story