- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణను దోచుకున్నారు..
వేలేరు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు, మండల రైతులకు గోదావరి జలాలతో రెండు పంటలకు సాగునీరు అందించే బాధ్యత తనదేనని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.

దిశ, ధర్మసాగర్ : వేలేరు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు, మండల రైతులకు గోదావరి జలాలతో రెండు పంటలకు సాగునీరు అందించే బాధ్యత తనదేనని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. వేలేరు మండల కేంద్రంలో నెల రోజుల్లో ఎంఆర్వో, ఎంపీడీవో కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. వారం రోజుల క్రితమే రూ.2 కోట్ల 20 లక్షలతో తహసీల్దార్ కార్యాలయ భవనం, రూ.2 కోట్లతో ఎంపీడీవో కార్యాలయ భవనం మంజూరైనట్లు వెల్లడించారు. గండి రామారం ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి, వేలేరు మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. ఒక పెద్దమనిషి తన గ్రామానికి మాత్రమే నీళ్లు వచ్చే పనులు చేసుకుని, మిగతా ప్రాంతాలను విస్మరించాడని విమర్శించారు. గత 30 ఏళ్లలో వేలేరు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని, అయితే తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండున్నర ఏళ్లలోనే రూ.2 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు 50 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గురించి గొప్పలు చెప్పుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేలేరులో ఒక్క ఇల్లు అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. రూ.8 కోట్లతో వేలేరు నుంచి కొమ్ముగుట్ట వరకు డబుల్ రోడ్డు, రూ.4 కోట్ల 50 లక్షలతో వేలేరు నుంచి శాలపల్లి వరకు బీటీ రోడ్డు, హ్యామ్ రోడ్ల అభివృద్ధికి రూ.13 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు.
ఈ రోడ్లన్నింటినీ 10 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మద్దెలగూడెం గ్రామాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు మద్దెలగూడెం గ్రామంలో గంగిరెద్దుల కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయడంతో పాటు, పీచర నుంచి కొమ్ముగుట్ట వరకు బీటీ రోడ్డు నిర్మాణం, గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం మద్దెలగూడెం గ్రామానికి 20 ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలోనే పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు రూ.3 కోట్లతో పీచర నుంచి కొమ్ముగుట్ట వరకు బీటీ రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టి, ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రెండో విడతలో మరో 20 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, కేవలం రెండేళ్లలోనే 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు బిల్లా యాదగిరి, హనుమకొండ మనోజ్, తహసీల్దార్, ఎంపీడీవో, హౌసింగ్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






