మోడీ ఇకనైనా కళ్లు తెరవాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

by Kodari Anjali |

ఒకప్పుడు పీఎం మోడీని సోషల్ మీడియా ద్వారా అభిమానించే యూత్ అంతా ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

మోడీ ఇకనైనా కళ్లు తెరవాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: నీట్ పరీక్ష పేపర్ లీకేజ్‌పై విద్యార్థులు తిరగబడ్డారని ఒకప్పుడు పీఎం మోడీని సోషల్ మీడియా ద్వారా అభిమానించే యూత్ అంతా ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మోడీ ఇకనైనా కళ్ళు తెరిచి నష్టపోయిన విద్యార్థులను ఆదుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో ఢిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. దేశవ్యాప్తంగా 19 లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన నీట్ పరీక్షలో అవకతవకలు జరిగితే కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. నీట్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కే ప్రయత్నాలను..

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం అమానుషమని మంత్రి అన్నారు. గాయపడిన విద్యార్థుల వైద్య ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరించాలని, నీట్ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎంపీ ధర్మపురి అరవింద్, బండి సంజయ్‌లకు సూచించారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులపై లాఠీచార్జ్ చేయించడం బాధాకరమని మంత్రి అన్నారు. గాయపడిన విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా డీసీసీ అధ్యక్షుడు నందయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story