- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి
ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ప్రత్యేక విద్యా వారోత్సవాల సందర్భంగా విద్యాశాఖఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులకు ఒకరోజు శిక్షణా, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని, గుడిని ఎంత శ్రద్ధగా చూసుకుంటారో బడిని కూడా అంతే బాధ్యతగా చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వ బడులు ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చాయని, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయని పేర్కొన్నారు.
పేద విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడంలో సర్పంచులు, కౌన్సిలర్లు ముందుండాలని కోరారు. బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచాలని, ఉపాధ్యాయులు పిల్లలను సొంత పిల్లల్లా చూసుకుంటూ వారి ప్రతిభను వెలికితీయాలని సూచించారు. బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి అవసరమని, మహిళల విద్యతోనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రతి బాలబాలిక తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు డ్రాప్‌ఔట్ విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు కోసం స్థానిక సంస్థల ప్రతినిధులు, గ్రామ ప్రజలు సమిష్టిగా పనిచేయాలని కోరారు. పాఠశాలల పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ అవసరమని తెలిపారు. ప్రత్యేక విద్యా వారోత్సవాల ద్వారా విద్య ప్రాముఖ్యతను గ్రామస్థాయికి తీసుకెళ్లి ప్రతి కుటుంబంలో చైతన్యం పెంపొందించాలని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తుకు విద్యనే బలమైన పునాది అని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డీఈఓ గిరిరాజు బాబు, డీడబ్ల్యూఓ విశ్వజ, ఉల్లాస్ అడల్ట్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ వేణుగోపాల్, మండలాల ఎంఈవోలు, గ్రామ సర్పంచులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






