డూప్లికేట్ ఓట్లపై చట్టపరమైన చర్యలు

by velandi.Saikiran |

ఎస్‌ఐఆర్-2026 కార్యక్రమానికి ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా సహకరించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి కోరారు.

డూప్లికేట్ ఓట్లపై చట్టపరమైన చర్యలు
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : ఓటరు జాబితాను మరింత ప్రామాణికంగా, పారదర్శకంగా రూపొందించే లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్-2026) కార్యక్రమానికి ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా సహకరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి కోరారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్‌ఐఆర్-2026 అమలు విధానం, ఎన్యుమరేషన్ ప్రక్రియ, ఓటర్ల బాధ్యతలపై సమగ్ర వివరణ అందించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ భాస్కర్ రెడ్డి ప్రత్యేక ప్రజెంటేషన్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారం పూరించే విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సరైన సమాచారం చేరవేసే విషయంలో మీడియా కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఎస్‌ఐఆర్‌పై అపోహలు, అనుమానాలు తొలగించి అవగాహన పెంపొందించడంలో మీడియా సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ప్రతి ఓటరూ ఈ ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో నిర్వహించిన ముందస్తు ఎస్ ఐ ఆర్ ప్రక్రియ సానుకూల ఫలితాలను ఇచ్చిందన్నారు. వరంగల్ పశ్చిమలో 68 శాతం, పరకాలలో 87 శాతం మేర మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ -2026లో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే హౌస్-టు-హౌస్ ఎన్యుమరేషన్ ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి ఓటరికి ఎన్యుమరేషన్ ఫారమ్ అందజేసి, ఇంట్లో లేని వారిని కనీసం మూడు సార్లు సందర్శించాలని ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన అర్హులందరికీ ఫారమ్-6 అందించి కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని, మరణించిన లేదా నివాసం మార్చిన ఓటర్ల వివరాలను తగిన ఆధారాలతో నమోదు చేయాలని, ఆధారాలు లేకుండా ఏ పేరును తొలగించరాదని స్పష్టం చేశారు. మరణించిన వ్యక్తుల పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్లు, బహుళ ప్రాంతాల్లో నమోదైన ఓట్లను గుర్తించి నిబంధనల ప్రకారం సవరిస్తామని చెప్పారు.

ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు నమోదు అయి ఉండటం లేదా తప్పుడు వివరాలు సమర్పించడం చట్టవిరుద్ధమని, సంబంధిత వ్యక్తులపై నిబంధనల మేరకు క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఈసిఐ సెక్షన్ 31 ప్రకారం రెండుచోట్ల ఓటు హక్కు కలిగి వుండటం నేరమని, దీనికి సదరు వ్యక్తులపై చట్ట ప్రకారం సంవత్సరం జైలు శిక్షతో పాటు జరిమానా విధించడం జరుగుతోందని అన్నారు.ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు, 1800 425 1126 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సేకరించిన వివరాలను అనంతరం ఆన్‌లైన్‌లో నమోదు చేసి పరిశీలన చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి, డీఆర్‌ఓ కె. శ్రీనివాస్, డీపీఆర్‌ఓ అయూబ్ అలీ,ఆర్డీవో వెంకటేష్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story