- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రౌడీయిజం వీడి మంచిగా బతకండి : డీసీపీ అంకిత్ కుమార్
రౌడీయిజం వీడి సమాజంలో గౌరవంగా జీవించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ రౌడీషీటర్లను హెచ్చరించారు.

దిశ, గీసుకొండ : రౌడీయిజం వీడి సమాజంలో గౌరవంగా జీవించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ రౌడీషీటర్లను హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శుక్రవారం ఈస్ట్ జోన్ పరిధిలోని 5 పోలీస్ స్టేషన్లకు చెందిన 33 మంది రౌడీషీటర్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గొడవలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. భూ వివాదాలు, సెటిల్‌మెంట్ల పేరుతో జోక్యం చేసుకుని అమాయకులను భయపెడితే రౌడీషీట్ కొనసాగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మంచిగా మారితే రౌడీషీట్ తొలగిస్తాం: డీసీపీ
చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని, మద్యం, జూదం, అక్రమ వసూళ్లు, గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు. కష్టపడి పని చేస్తూ కుటుంబ బాధ్యతలు చూసుకోవాలని, మహిళలు, చిన్నపిల్లలతో మర్యాదగా ఉండాలని చెప్పారు. ప్రవర్తన మార్చుకుని మంచిగా ఉంటే రౌడీషీట్ తొలగించే అవకాశం పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి కదలికపై పోలీసుల నిఘా
ఫోన్ నంబర్, అడ్రస్ మారితే వెంటనే పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని, పెండింగ్ కేసుల విచారణకు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. గ్రామాల్లో నేరం జరిగితే వెంటనే పోలీసులకు చెప్పాలన్నారు. ఇక పై ప్రతి ఒక్కరి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంటుందని డీసీపీ తెలిపారు. ఈ కౌన్సెలింగ్ కార్యక్రమంలో ఏసీపీ మామునూరు వెంకటేష్, గీసుగొండ సీఐ విశ్వేశ్వర్, ఎన్నుమాముల సీఐ సురేష్, మామునూరు సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు వంశీకృష్ణ, కుమార్, తాహెర్ పాల్గొన్నారు. సమావేశానికి గీసుగొండ, మామునూరు, ఎన్నుమాముల, ఐనవోలు, పర్వతగిరి పీఎస్ పరిధిలోని 33 మంది రౌడీషీటర్లు హాజరయ్యారు.






