కౌలు భూమి వివాదం.. అన్న‌ద‌మ్ముల వ‌ర్గాల‌ మ‌ధ్య తీవ్ర ఘ‌ర‌ణ

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-02-28 12:25:46  IST  )

కౌలు భూమి వివాదం.. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. ఈ ఘ‌ట‌న హ‌నుమ‌కొండ జిల్లా ఎల్కతుర్తి మండ‌ల ప‌రిధిలోని జ‌గ‌న్నాథ‌పురం గ్రామంలో చోటు చేసుకుంది.

కౌలు భూమి వివాదం.. అన్న‌ద‌మ్ముల వ‌ర్గాల‌ మ‌ధ్య తీవ్ర ఘ‌ర‌ణ
X

దిశ‌, ఎల్క‌తుర్తి : కౌలు భూమి వివాదం.. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. ఈ ఘ‌ట‌న హ‌నుమ‌కొండ జిల్లా ఎల్కతుర్తి మండ‌ల ప‌రిధిలోని జ‌గ‌న్నాథ‌పురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ‌స్తులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జ‌గ‌న్నాథ‌పురం గ్రామానికి చెందిన కస్తూరి రాజయ్య, కస్తూరి కొమురయ్య ఇద్ద‌రు అన్నదమ్ముల మధ్య దాదాపు నాలుగు ఎకరాల కౌలు భూమి సాగు హక్కులపై గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నట్టు గ్రామస్థులు తెలిపారు. ఈ భూమిని ఎవరు సాగు చేయాలనే అంశంపై పలుమార్లు అన్న దమ్ముల మధ్య తగాదాలు జ‌రిగాయి. ఈ క్ర‌మంలోనే శుక్రవారం రాత్రి వివాదం తీవ్రరూపం దాల్చింది. ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గం ఇంటి వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఈ క్రమంలో రాజయ్య కుటుంబ సభ్యుల ఇంటి పై దాడి చేసి, కారంపొడి చల్లి కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నట్లు బాధితులు ఆరోపించారు.

ఈ ఘటనలో రాజయ్య కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి తల, చేతులు, శరీర భాగాల్లో గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి వారిని వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దాడి ఘటనపై కస్తూరి రాజయ్య కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, ఇరువర్గాల వివరాలు సేకరించారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసి, ఘర్షణకు గల కారణాలు, పాల్గొన్న వ్యక్తులపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Next Story