కాంగ్రెస్‌లో వ‌ర్గ పోరు.. తారాస్థాయికి చేరుకున్న కోల్డ్‌వార్‌

by Bhanu |

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా కాంగ్రెస్‌లో వ‌ర్గ‌పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇన్నాళ్లు నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్నా కోల్డ్‌వార్ కొండా ముర‌ళీ వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు బ‌హిర్గ‌త‌మైంది.

కాంగ్రెస్‌లో వ‌ర్గ పోరు.. తారాస్థాయికి చేరుకున్న కోల్డ్‌వార్‌
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా కాంగ్రెస్‌లో వ‌ర్గ‌పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇన్నాళ్లు నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్నా కోల్డ్‌వార్ కొండా ముర‌ళీ వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు బ‌హిర్గ‌త‌మైంది. మంత్రి కొండా సురేఖ‌తో ఎమ్మెల్యేల‌కు కొన‌సాగుతున్న పొలిటిక‌ల్ గ్యాప్‌ను మాజీ ఎమ్మెల్సీ ముర‌ళీధ‌ర్‌రావు వ్యాఖ్య‌లు బ‌హిర్గ‌తం చేస్తున్నాయి. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మ‌ధ్య గ‌త కొద్దిరోజులుగా చాటుమాటుగా సాగుతున్న రాజ‌కీయ కుట్ర‌లు.. ఇప్పుడు ప్ర‌త్య‌క్షంగా విమ‌ర్శ‌లు చేసుకునే స్థాయికి చేరుకున్నాయి.

కోల్డ్‌వార్ ముదిరి పాక‌న ప‌డుతుండ‌టంతో నేరుగానే విమ‌ర్శ‌లు, వ్య‌ంగ్యాస్త్రాల‌కు దిగుతుండ‌టం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని వ‌రంగ‌ల్ పోచ‌మ్మ‌ మైదాన్‌లో ఏర్పాటు చేసిన వేడుక‌ల్లో మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భ‌ర్త ముర‌ళీధ‌ర్‌రావు సొంత పార్టీ నేత‌ల‌పై చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సురేఖ మంత్రి పోతోంద‌ని కొంత‌మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్ర‌చారం చేస్తున్నారంటూ ప‌రోక్షంగా క‌డియం, రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డిల‌ను ఉద్దేశించి వ్యాఖ్య‌నించారు.

ప‌ర‌కాల‌లో త‌న‌ను గెలిపించాల‌ని ఆ ముస‌లోడు న‌న్ను ఇంటికి వ‌చ్చి వేడుకున్నాడంటూ రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. అలాగే ఎన్‌కౌంట‌ర్‌ల స్పెష‌లిస్టు.. గ‌తంలో కేసీఆర్‌, చంద్ర‌బాబుల‌కు చెందిన బీఆర్ఎస్‌, టీడీపీల‌ను భ్ర‌ష్టు ప‌ట్టించిన నేత అంటూ క‌డియంను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.కొండా దంప‌తులు, కొండా అనుచ‌రుల‌పై పార్టీ అధిష్ఠానం వ‌ద్ద ఫిర్యాదులు ఇప్ప‌టికే కొన్ని ఉండ‌గా తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై కొండా ముర‌ళిధ‌ర్‌రావు చేసిన ఈ వ్యాఖ్య‌లను పార్టీ పెద్ద‌లు ఏవిధంగా తీసుకుంటార‌నే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యేలు..!

గ‌త కొద్దిరోజులుగా మంత్రి కొండా సురేఖ‌కు మంత్రి వ‌ర్గం నుంచి ఉద్వాస‌న పలుకుతార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇందుకు ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను ఉదాహ‌రిస్తూ పార్టీకి చెందిన సీనియ‌ర్ ఎమ్మెల్యేలు ఈ ప్ర‌చారం సాగిస్తున్న‌ట్లుగా కొండా వ‌ర్గం భావిస్తూ వ‌స్తోంది. అయితే ఇటీవ‌ల కొండా ముర‌ళీకి వ‌రంగ‌ల్ డివిజ‌న్ పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వ‌డాన్ని త‌ప్పుబ‌ట్టిన కాంగ్రెస్ పార్టీకే చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. స‌ద‌రు పోలీసుల‌కు సీపీ స‌న్ ప్రీత్‌సింగ్ మెమోలు జారీ చేయ‌డంతో ఈ ప‌రిణామం రాజ‌కీయ రంగు పులుముకుంది. గ‌తంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్పోరేట‌ర్‌పై అత్యాచారం య‌త్నం, అట్రాసిటీ కేసు న‌మోదు కావ‌డం వెనుక ఆయ‌న అనుచ‌ర‌వ‌ర్గం నేత‌లు ఉన్నార‌ని, ఈ విష‌యంపై ఓ సీనియ‌ర్ ప్ర‌జాప్ర‌తినిధి సీపీనిక‌ల‌వ‌డం, త‌దుప‌రి సీఎం రేవంత్ రెడ్డి, సీఎం ముఖ్య స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్‌రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారు.

ఈ ప‌రిణామం వ‌రంగ‌ల్ తూర్పులో మ‌రింత పోలిటిక‌ల్ హీట్‌ను పెంచేసింది. కొండా దంప‌తులు ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించే వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వైఖ‌రితో మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ఎమ్మెల్యేలు సైతం వారి నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఆహ్వానించ‌డం లేదు. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు మంత్రికి ఆహ్వానం ప‌ల‌క‌క‌పోవ‌డం, పార్టీ స‌మావేశాల్లోనూ జిల్లా ఎమ్మెల్యేల‌తో మంత్రి సురేఖ ఎడ‌మొహం, పెడ‌మొహం అన్న‌చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యేలుగా ప‌రిస్థితి మారింది. వ‌రంగ‌ల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా మిన‌హా ప్ర‌త్యేకంగా జిల్లా మంత్రి హోదాలో సురేఖ ఉమ్మ‌డి జిల్లా నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌ల్లో పాల్గొన్న‌ది బ‌హు త‌క్కువ‌నే చెప్పాలి.

తారాస్థాయికి చేరుకున్న కోల్డ్‌వార్‌..!

ఇన్నాళ్లు కోల్డ్‌వార్ స్థాయిలోనే ఉన్న వ‌ర్గ‌పోరు.. ఇప్పుడు ప్ర‌త్య‌క్షంగా వేదిక‌ల‌పై విమ‌ర్శ‌లు చేసే స్థాయి చేరుకుంది. మంత్రి సురేఖ ప‌ద‌వి పోతోంద‌నే ప్ర‌చారంపై కొండా ముర‌ళీధ‌ర్‌రావు ఇప్పుడు మాస్ వార్నింగ్‌లు ఇవ్వ‌డంపై కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను సైతం షాక్‌గా గురి చేసింది. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన ప్ర‌జాప్ర‌తినిధులు ద‌మ్ముంటే రాజీనామాలు చేసి గెల‌వాలంటూ స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి, ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య‌ల‌ను ఉద్దేశించి స‌వాల్ విసిరారు. గెలిపించాల‌ని త‌న కాళ్లు ప‌ట్టుకున్నాడంటూ ప‌ర‌కాల ఎమ్మెల్యే ప్ర‌కాశ్‌రెడ్డిపై వ్యాఖ్య‌నించారు. ఇదిలా ఉండ‌గా గ‌త కొంత‌కాలంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం కొండా దంప‌తుల‌పై ఫిర్యాదులు చేస్తూ వ‌స్తున్న‌ట్లు స‌మాచారం.

కొండా సురేఖ‌ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తే ఆ స్థానంలో జిల్లా నుంచి సీనియ‌ర్ల‌లో ఎవ‌రో ఒక‌రికి అవ‌కాశం ల‌భిస్తుంద‌న్న ల‌క్ష్యంతో కూడా రాజ‌కీయ కుట్ర జ‌రుగుతోంద‌న్న ఆరోప‌ణ‌లు కొండా వ‌ర్గం నేత‌ల మ‌ధ్య జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. గ‌తంలో టీడీపీలో ప‌నిచేసి.. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కొన‌సాగుతున్న వారంతా కూడా ఒక కూట‌మిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కొండా వ‌ర్గం నేత‌ల నుంచి ఆరోప‌ణ‌లు వినిపిస్తుండ‌గా, వీరిద్ద‌రికి సీఎంకు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న మ‌రో ముఖ్య నేత స‌హ‌క‌రిస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. తెర‌వెనుక జ‌రుగుతున్న ప‌రిణామాల ప‌ర్య‌వ‌సాన‌మే.. కొండా ముర‌ళీధ‌ర్‌రావు ఆగ్రహావేశానికి కార‌ణ‌మ‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. కాంగ్రెస్‌లో పెరుగుతున్న వ‌ర్గ‌పోరు ఎలాంటి పరిస్థితుల‌కు దారి తీస్తుందో వేచి చూడాలి.

Next Story