కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను నాశనం చేసింది

by velandi.Saikiran |   (  Updated:2025-10-24 11:58:27  IST  )

బీఆర్ఎస్ నేతలు చేసే చౌకబారు విమర్శలకు స్పందించాల్సిన అవసరం నాకు లేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను నాశనం చేసింది
X

దిశ, వరంగల్ బ్యూరో: బీఆర్ఎస్ నేతలు చేసే చౌకబారు విమర్శలకు స్పందించాల్సిన అవసరం నాకు లేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. నా 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ రౌడీయిజం, భూ కబ్జాలు చేయలేదు... అవినీతికి పాల్పడలేదని అన్నారు. అభివృద్ధిలో నాతో పోటీ పడలేని వారే నాపై విమర్శలు చేస్తారని తెలిపారు. నా పనితీరుకు నియోజకవర్గానికి తెచ్చిన నిదులే సాక్ష్యం అని అన్నారు.రానున్న రోజులలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చెందిన మొదటి 10నియోజకవర్గాలలో ఒకటిగా నిలబెడుతానని పేర్కొన్నారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం గత 15ఏళ్ళు చేతకాని దద్దమ్మల చేతిలో చాలా నష్టపోయిందని ఆరోపించారు. జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుండి సాధ్యమైనంత వరకు పూడ్చే ప్రయత్నం చేస్తున్నాని అన్నారు. పసలేని, పనికిరాని వాళ్ళు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను నాశనం చేసిందని, ముందు వాళ్ల కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని సూచించారు. వాళ్ల విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని స్పష్టం చేశారు. కొండా సురేఖ సమస్య సమసిపోయిందని ఇప్పుడు దానిపై మాట్లాడడానికి ఏమి లేదని అన్నారు. పనులను స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురావేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Next Story