- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

దిశ, హన్మకొండ కలెక్టరేట్: రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీ చేసే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. బుధవారం సెక్రటేరియట్‌లోని మంత్రి చాంబర్‌లో జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మంత్రిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వాలని ఇప్పటికే కలెక్టర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారులకు (డీపీఆర్వోలకు) ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులతో పాటు ప్రభుత్వం నిబంధనల ప్రకారం వెటరన్ జర్నలిస్టులు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే కొన్ని జిల్లాల్లో నిబంధనలు అమలు కాకపోవడంతో అక్రిడేషన్ల జారీ ఆలస్యమవుతోందని జర్నలిస్టు సంక్షేమ సంఘం ప్రతినిధులు తమ దృష్టికి తీసుకువచ్చారని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో అర్హత ఉన్న వర్కింగ్ జర్నలిస్టులతో పాటు వెటరన్, ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు నిబంధనల ప్రకారం అక్రిడేషన్లు జారీ చేయాలని సమాచార శాఖ కమిషనర్, కలెక్టర్లు, డీపీఆర్వోలకు మరోసారి ఆదేశాలు ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మంత్రి ఆదేశాల అనంతరం కూడా అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామని జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చీకట్ల శ్రీనివాస్, జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాస్, డాక్టర్ కానుగంటి రాజు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బాలేశం, వైస్ ప్రెసిడెంట్ రావుల విశ్వప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






