- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందంజ
నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల

దిశ, జనగామ: నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో జనగామ జిల్లా రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలుస్తోంది. జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ప్రత్యేక శ్రద్ధ, నిరంతర పర్యవేక్షణ ఫలితంగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. లబ్ధిదారులకు మంజూరైన ప్రతీ ఇల్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగా, గ్రౌండింగ్ ప్రక్రియలో జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. అర్హులైన నిరుపేదలకే లబ్ధి చేకూరేలా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
పక్కా కార్యాచరణతో ముందుకు..
ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు జిల్లా యంత్రాంగం పక్కా కార్యాచరణతో ముందుకెళ్లిందన్నారు. అర్హుల ఎంపిక నుంచి ఇళ్ల గ్రౌండింగ్, నిర్మాణ పురోగతి వరకూ ప్రతీ దశను మండలాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ప్రతీ మండలంలో మంజూరైన ఇళ్లు, గ్రౌండింగ్, నిర్మాణ దశలో ఉన్న ఇళ్ల వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
క్షేత్రస్థాయి పర్యవేక్షణే కీలకం..
పథకం ప్రారంభం నుంచే మండల స్పెషల్ అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపడంతో నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందిరమ్మ కమిటీల సహకారం కూడా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టడంలో కీలకంగా నిలిచిందన్నారు.
గణాంకాలు ఇలా...
జిల్లాలో రెండు విడతల్లో మొత్తం 5,834 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 5,206 ఇళ్లు నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి.ఇప్పటికే 33 ఇళ్లు పూర్తయ్యాయి. 4,499 మంది లబ్ధిదారులకు వివిధ దశల వారీగా ఆర్థిక సహాయం విడుదలైంది. ప్రభుత్వం చేపట్టే ప్రతీ సంక్షేమ పథకం ప్రతి గడపకూ చేరేలా పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నామని, వివిధ శాఖల అధికారులను భాగస్వాములుగా చేసుకుని నిరంతర పర్యవేక్షణ చేపట్టడమే ఈ విజయానికి మూలమని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ స్పష్టం చేశారు.






