ఇంచార్జ్ ల పాలనలో ఇస్లావత్ తండా

by Bhanu |   (  Updated:2025-05-25 11:59:51  IST  )

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని.. పల్లెల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని పాలకులు చెబుతుంటారు.

ఇంచార్జ్ ల పాలనలో ఇస్లావత్ తండా
X

దిశ, పర్వతగిరి: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని.. పల్లెల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని పాలకులు చెబుతుంటారు. కానీ పల్లెల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండి, కనీసం వాటిని పట్టించుకునే నాథుడే లేకపోతే ఇక గ్రామాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది. కనీసం వీధి లైట్లు సైతం వెలగని పరిస్థితి ఉంటే దేశాభివృద్ధి ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితి. పర్వతగిరి మండలంలోని ఇస్లావత్ తండా గ్రామ పంచాయతీ కార్యానిర్వహణ మొత్తం ఇంచార్జ్ ల పాలనలో కొనసాగుతోంది.

రికార్డుల నిర్వహణ, గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన పనుల వివరాలు, వాటికి సంబంధించిన జమ, ఖర్చుల వివరాల నమోదు అస్తవ్యస్తంగా తయారైంది. పంచాయతీ కార్యాలయంలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా లేకుండా ఉంది. అలాగే వీధి లైట్లు సైతం వెలగక తండాలో అంధకారం నెలకొంది. అయితే పంచాయతీ పాలన సక్రమంగా అమలు చేయాలంటే నిధులు లేవని, దీంతో ఎక్కడి పనులు అక్కడే ఉండి పోతున్నాయని స్థానికుల అంటున్నారు.

చుట్టపు చూపుగా ప్రత్యేక అధికారి

గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ల పాలన ముగియగానే పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామానికో ప్రత్యేక అధికారిని నియమించారు. అయితే ఇస్లావత్ తండా గ్రామ పంచాయతీకి నియమించిన ప్రత్యేక అధికారి చుట్టపు చూపుగా వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జనవరి 26 , రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భాల్లో తప్ప ఒక్క రోజు కూడా తండాకు వచ్చిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. పంచాయతీ కార్యదర్శి ఎవరో కూడా కొందరికి తెలియని పరిస్థితి నెలకొంది. అత్యవసర పనులు , బిల్లులు, రికార్డులు ఏమైనా ఉంటే పంచాయతీ సిబ్బంది మండల కేంద్రానికి తీసుకుని వెళ్తే క్లియర్ చేస్తున్నారు.


దీంతో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక పట్టించుకోనే పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇస్లావత్ తండా గ్రామ పంచాయతీ సమస్యలతో సతమతమవుతుంది. అయితే గిరిజన తండా గ్రామ పంచాయతీలపై స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యే సైతం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్లు తండా వాసులు అంటున్నారు. పేరుకే పంచాయతీలు ఏర్పాటు చేసిన, వాటి నిర్వహణను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇస్లావత్ తండా గ్రామ పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తండాలో నెలకొన్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు మండలం అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.

Next Story