- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజన హాస్టల్లో ఇష్టారాజ్యం
గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల సీతానగరంలో నిర్లక్ష్యం, అవినీతి రాజ్యమేలుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతగా ఉండాల్సిన పాఠశాల నిర్వాహకులు ఉదాసీనత ప్రదర్శించడమే కాకుండా విద్యార్థులను ఆర్థిక వనరులుగా వాడుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

దిశ, గూడూరు : గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల సీతానగరంలో నిర్లక్ష్యం, అవినీతి రాజ్యమేలుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతగా ఉండాల్సిన పాఠశాల నిర్వాహకులు ఉదాసీనత ప్రదర్శించడమే కాకుండా విద్యార్థులను ఆర్థిక వనరులుగా వాడుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నిరుపేద విద్యారుల దగ్గర సాకులు చూపెడుతూ వారి నుంచి ఫైన్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం అమలు పరుస్తున్న నూతన మెనులో సైతం చిలక్కొట్టుడు కొడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్న ఘటనలు బయటపడుతున్నాయి. హాస్టల్ నిర్వహణ బాధ్యతలు కిందిస్థాయి సిబ్బందికి అప్పజెప్తూ పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనపడుతోందని మెజారిటీ స్థానికుల నుండి వ్యక్తం అవుతోంది. మెనూ ప్రకారం చికెన్, మటన్ దేవుడెరుగు కనీసం గుడ్డు పెట్టడంలోనూ వెనకడుగు వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విధుల్లో ఉండాల్సిన సిబ్బంది రోజుల కొద్దీ గైర్హాజరు కావడం చాలా సాధారణ విషయంగా మారినట్లు తెలుస్తోంది. కింది స్థాయి సిబ్బందితోనే రోజులు గడుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆశ్రమ పాఠశాలలో అనుకోని ఘటనలు చోటు చేసుకోవడంతో విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోవడానికి కారణంగా తెలుస్తోంది. అదును చూసి ప్రతీ విషయంలోనూ ఆర్థిక లాభాపేక్షతో పాఠశాల నిర్వాహకులు వ్యవహరించడం పెద్ద దుమారాన్ని లేపింది.
రిజిస్టర్ లోనే విద్యార్థులు..
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని సీతానగరం ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరో వైపు పాఠశాలలో ఉండే విద్యార్థుల సంఖ్యకు హాజరు రిజిస్టర్ లో ఉండే సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ఈ నెల 10 నుండి 16వ తేదీ వరకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల ఒకటో తేదీ నుండే విద్యార్థులను సెలవులు తీసుకోవాలని పురమాయించడం, వెళ్ళిపోవాలని చెప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య కూడా తగ్గడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. విద్యార్థులు ఇండ్లకు వెళ్ళినా రిజిస్టర్ లో మాత్రం వారికి అనుకూలంగా నమోదు చేయడం గమనార్హం.
మెను పాటించే ముచ్చటే లేదు
ప్రభుత్వ నిబంధనల మేరకు ఆశ్రమ పాఠశాలలో మెనూ పాటించాల్సి ఉంది. వారంలో నిర్ణయించిన విధంగా విద్యార్థులకు మెనూ ప్రకారం ఫుడ్ అందించాల్సి ఉంటుంది. కానీ అవేమీ పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆరోపించడం కోసమెరుపు. వాస్తవానికి నెలకు ఆరు సార్లు చికెన్, నాలుగు సార్లు మటన్, వారానికి రెండు సార్లు గుడ్డు పెట్టాల్సి ఉన్నట్లు సమాచారం. కానీ అమలులో ఇవేమీ ఉండట్లేదని మెజారిటీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
సరదా కోసం వసూళ్లు..!
సీతానాగారం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల నుండి ఫైన్లు వసూలు చేస్తున్నారన్న విషయం ఆధారాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివరణ కోరేందుకు ప్రయత్నం చేయగా... ఫైన్ల వసూలు పై సదరు బాధ్యులు స్పందించారు. విద్యార్థులకు భయం ఉండాలని వసూలు చేసినట్లు తెలిపారు. వసూలు కేవలం సరదా కోసం... విద్యార్థుల ఖర్చుల కోసం, కేకు కటింగ్ లాంటి వాటి కోసం ఉపయోగిస్తామని చెప్పడం గమనార్హం.
విద్యార్థుల సంఖ్య తగ్గింపుపై భిన్న వాదనలు...
ఆశ్రమ పాఠశాల లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోల్చితే ఈ ఏడాది తగ్గినట్లు తెలుస్తోంది. దీనికి హాస్టల్ వార్డెన్, హెడ్ మాస్టర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. హాస్టల్ లో నెలకొన్న సమస్యలు, విద్యార్థుల ఇబ్బందుల పట్ల వీరు తగిన విధంగా స్పందించకపోవడం ప్రధానమని సమాచారం. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది. తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ఉన్నపళంగా ఇక్కడ నుండి టీసీ లు తీసుకుని వెళ్లినట్లు బహిరంగ చర్చ జరుగుతోంది. ప్రధానంగా విద్యార్థుల భద్రత, సంక్షేమం పట్ల ఎమరపాటు ప్రదర్శించడం, లాభాపేక్ష దృష్టితో మెదలడంతోనే సమస్య ఉత్పన్నం అయినట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.






