కాంగ్రెస్ లో అంత‌ర్గ‌త క‌ల‌హాలు బ‌హిర్గ‌తం

by Nallavelli.Anjaneyulu |

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అని చెప్పుకుంటున్న కొంతమంది నాయకులు కోవర్ట్‌లుగా వ్యవహరిస్తూ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

కాంగ్రెస్ లో అంత‌ర్గ‌త క‌ల‌హాలు బ‌హిర్గ‌తం
X

దిశ, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అని చెప్పుకుంటున్న కొంతమంది నాయకులు కోవర్ట్‌లుగా వ్యవహరిస్తూ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పార్టీకి విధేయులమని చెప్పుకుంటూ బయట మాత్రం ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా పని చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించే కుట్రలు పన్నారని వారు మండిపడ్డారు. ముఖ్యంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులుగా వ్యవహరిస్తున్న కొందరు నాయకులు పార్టీని లోపల నుంచే దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరాజయాలకు ప్రధాన కారణం ఈ రెబల్ అభ్యర్థులేనని పేర్కొన్నారు. పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడవడం వల్లే విభేదాలు తీవ్రరూపం దాల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు మాట్లాడుతూ.. మా 9 మంది కౌన్సిలర్ అభ్యర్థుల ఓటమికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అని చెప్పుకుంటున్న కాకిరాల హరిప్రసాద్, రామ సహాయం కృష్ణ కిషోర్ రెడ్డిలు అన్నారు. పార్టీకి విధేయులమని చెప్పుకుంటూ తమ వార్డుల్లో తప్పుడు ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కొందరు నాయకులు వ్యక్తి గత ప్రయోజనాల కోసం గ్రూపు రాజకీయాలు చేస్తూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న ఈ ఇద్దరు నాయకులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై త్వరలోనే టీపీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమస్యను వివరిస్తామని పేర్కొన్నారు. రాబోయే జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పార్టీ అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బలపరిచిన వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు పొనుగోటి సోమేశ్వరరావు, పంజా కల్పన, రాంబాబు, జలగం శీను, సుధాకర్, కిరణ్ తో పాటు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story