పేదోడికి గూడు కట్టాలని విజ్ఞత ఆనాటి పెద్దలకు లేదు : మంత్రి పొంగులేటి

by Bhanu |

బుధవారం ములుగు జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు.

పేదోడికి గూడు కట్టాలని విజ్ఞత ఆనాటి పెద్దలకు లేదు : మంత్రి పొంగులేటి
X

దిశ, ములుగు ప్రతినిధి: బుధవారం ములుగు జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. ఈ పర్యటనలు భాగంగా ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ లో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజా, నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి సీతక్క స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇంచర్ల గ్రామంలో జరిగిన ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సుమారు 24 లక్షల 50వేల ఇందిరమ్మ ఇల్లు కట్టిన ఘన చరిత్ర మన ఇందిరమ్మ ప్రభుత్వాన్నిదని, ప్రతి ఊళ్లో గుడి ఉందో లేదో తెలియదు కానీ ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తాయని, ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం వాళ్ల సోకులకి వాళ్ళ అందానికి వాళ్లు నివసించడానికి ఇళ్ళకి డబ్బు ఖర్చు పెట్టారే తప్ప పేదోడు ఉండటానికి ఒక గూడు కట్టాలని కనీస విజ్ఞత, జ్ఞానం కూడా ఆనాటి పెద్దలకు రాకపోవటం బాధాకరం అన్నారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించి పేపర్లలో, టీవీలలో ఇదిగో ఈసారి నేను గెలిస్తే ఇగో నీకు ఇటువంటి ఇల్లు ఇస్తానని అద్భుతమైన బొమ్మల చూపించి బొమ్మలతో కాలయాపన చేసి రెండుసార్లు ఆనాటి పెద్దలు పరిపాలించారని మండపడ్డారు. ఆ పది సంవత్సరాలలో 93,000 ఇల్లు టెండర్లు పిలిచి పూర్తి చేసింది కేవలం 60 వేల చిల్లర అని, మిగిలిన 30 వేల ఇల్లు మొండి గోడలతో దర్శనమిస్తున్నాయని అన్నారు.ములుగు నియోజకవర్గానికి ఇప్పటికే 3,500 ఇండ్లు, ఐటిడిఏ పరిధిలో మరో 1,500 ఇండ్లను మంజూరు చేశామని,మంత్రిగా సీతక్క అభ్యర్థన మేరకు ములుగు ప్రాంతానికి అదనంగా మరో 1,000 ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇండ్ల నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులకు ప్రతీ సోమవారం నిధులు విడుదల చేస్తామన్నారు.

అటవీ భూముల్లో ఇప్పటికే నివాసం ఉండే వారికి అక్కడే ఇండ్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించాలంటూ అటవీ అధికారులను ఆదేశించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో చెంచుల కోసం 10 వేల ఇండ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంజూరు చేశామని, గత కాంగ్రెస్ హయాంలో 25.5 లక్షల ఇండ్లు మంజూరైనప్పటికీ, తరువాత వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ కేవలం 92 వేల ఇండ్లకే ఆమోదం తెలిపి, 60 వేల ఇండ్లను మాత్రమే పూర్తి చేయగలిగిందని, మిగిలినవి మొండిగోడలుగా మిగిలిపోయాయని ఆయన విమర్శించారు. అప్పటి కాంట్రాక్టర్లకు కూడా బకాయిలు చెల్లించలేదన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వ అప్పులు చెల్లిస్తూ, పైసాపైసా కూడబెట్టి పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లతో నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇండ్లు నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ప్రతి గ్రామంలో కనీసం 60 మంది అర్హులు ఉన్నా, ప్రస్తుతం ఒక్కో గ్రామానికి 25 ఇండ్లే కేటాయించగలిగామని, భవిష్యత్తులో అన్ని అర్హులకూ ఇండ్లు మంజూరవుతాయని,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని,కలెక్టర్లకే ఇసుక కూపన్ల పంపిణీ బాధ్యతలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ముందుంది, కావున రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో భూ సమస్యల పరిష్కారానికి రైతులు అధికారుల చుట్టూ తిరిగారని, ఇప్పుడు రెవెన్యూ అధికారులు ప్రజల చెంతకే వస్తున్నారని మంత్రి గుర్తుచేశారు.

ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం- మంత్రి సీతక్క....

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అని, నాలుగున్నర లక్షల మందికి రాష్ట్రంలో మొదటి విడతగా ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరుగుతుంది అని, బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తాం అని వెయ్యి సాంక్షన్ చేస్తే 500 కూడా కట్టలే,500 నిర్మిస్తే బిల్లులు కూడా రాలేదు అని అన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో 80,000 ఇల్లు కట్టిస్తే బిల్లులు కూడా రాలేదు అని, మాజీ ముఖ్యమంత్రి పేదలకు డబల్ బెడ్ రూమ్ లు అందిస్తామని మోసం చేశారని, నేడు ఇందిరమ్మ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టడంతో దానిని ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు దృష్పప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి పేదవాడికి నీడని అందించడంతోపాటు కడుపునిండా తిండి తినడానికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం, ఇచ్చిన హామీలన్నిటిని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని వివరించారు. జిల్లాను పూర్తిస్థాయిలో పర్యాటక ప్రాంతంగా మార్చడానికి నిధులు కేటాయించడం జరిగిందని, 70 కోట్ల రూపాయలతో రామప్పలో పనులు చేపట్టడమే కాకుండా 30 కోట్ల రూపాయలతో ఐలాండ్ అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి మహిళ మహిళా సంఘాలలో చేరి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పొంది పలు రకాల వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు.

ఇక్కడి ప్రాంతంలోని మహిళలకు ఇతర ప్రాంతాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన బొంగు చికెన్ పై శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, పేదల గూర్చి ఆలోచించే ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Next Story