అడవి భూములపై అక్రమ కబ్జాలు

by Bhanu |

మావోయిస్టు నేత‌ హిడ్మా మరణంతో అడవి ప్రాంతాల్లో భయాందోళనలు త‌గ్గాయి. దీంతో అక్రమ భూకబ్జాదారులు క‌న్ను అట‌వీ భూముల‌పై ప‌డింది.

అడవి భూములపై అక్రమ కబ్జాలు
X

దిశ, భీమదేవరపల్లి : మావోయిస్టు నేత‌ హిడ్మా మరణంతో అడవి ప్రాంతాల్లో భయాందోళనలు త‌గ్గాయి. దీంతో అక్రమ భూకబ్జాదారులు క‌న్ను అట‌వీ భూముల‌పై ప‌డింది. ఏండ్ల క్రితం భూమిని పట్టా చేసుకున్న వారు మావోయిస్టుల ప్రభావం ఉండడం వల్ల ఇంత‌వ‌ర‌కు భూముల వైపు రాలేదు. ఇప్పుడు హిడ్మా చనిపోవడంతో భూమి తమదేనంటూ కబ్జాకు ముందుకొస్తున్నారు.మూడు మండలాలైన ధర్మసాగర్–ఎల్కతుర్తి–భీమదేవరపల్లి సరిహద్దులు కలిసిన ప్రాంతంలో అడవి భూములపై భారీ స్థాయిలో కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జేసీబీలు, బుల్డోజర్లు నిరంతరం పనిచేస్తుండటం వల్ల గ్రామాల్లో ఆందోళన పెరుగుతోంది.

89 ఎకరాల భూమిపై దృష్టి..

దామెర శివారు సర్వే నం. 496/3, దేవునూరు 531, కొత్తపల్లి 609, ఈ మూడు ప్రాంతాల్లో హద్దులు కలిసిన ఇందులో దామెర శివారు ప్రాంతంలోని 496/3 సర్వే నెంబర్లో సుమారు 89 ఎకరాల భూమిని కొంతమంది ప్రైవేటు భూమి అంటూ చదును చేస్తున్నారు. సర్వే హద్దులు ఇంకా తుది నిర్ణయం కాకపోయినా, భూమి తమదేనని వాదిస్తూ యంత్రాలను రంగంలోకి దించారు.

ఓ కంపెనీ పేరుతో కబ్జా..?

ఈ భూమి ఓ కంపెనీదని చెప్పి, ఆ పేరునే అడ్డుపెట్టుకుని ఆశ్చర్యకరంగా పూర్తిగా సంబంధం లేని వ్యక్తులే కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు కంపెనీ ప్రతినిధులు లేకుండా, స్థానికేతరులు పాత పత్రాలు చూపిస్తూ భూమిని స్వాధీనపరుచుకోవడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్ సైన్ కాపీలతో అనుమానాలు కలకలం..

ఇదిలా ఉండగా, భూమిని చదును చేస్తున్న వ్యక్తులు హనుమకొండ జిల్లా కలెక్టర్ సంతకాలతో అనుమతులు ఉన్నట్టుగా చూపిస్తున్న కాపీలు ప్రదర్శించడం పరిస్థితిని మరింత సందేహాస్పదంగా మార్చింది. ఈ పత్రాలు అసలైనవేనా..? లేక నకిలీవా..? సర్వే పూర్తయ్యేలోపే ఎందుకు ఇంత తొందర? అనే ప్రశ్నలు గ్రామాలలో చర్చనీయాంశంగా మారాయి.

హిడ్మా మరణం తర్వాత భూకబ్జాల కదలికలు..

ప్రాంతం ఎప్పటినుంచో మావోయిస్టు ప్రభావితమవుతుండటంతో, అక్కడ పెద్దగా చట్టవ్యతిరేక కదలికలు ఉండేవి కాదు. అయితే హిడ్మా మరణం తర్వాత అడవి ప్రాంతాల్లో కదలికలు తగ్గడంతో, భూకబ్జాదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చర్యలు ముమ్మరం చేశారన్నది స్థానికులు అభిప్రాయం.

తక్షణ విచారణ కోరుతున్న ప్రజలు..

భూములపై నిజమైన యాజమాన్య హ‌క్కులు ఎవ‌రికి..? చూపిస్తున్న పత్రాలు ఎంతవరకు చెల్లుబాటు అవుతాయి..? సర్వే లేకుండానే చదును పనులు ఎందుకు..? అక్రమ కబ్జాలు ఎవరి ఆధారంతో..? చేప‌డుతున్నారు. ఈ ప్రశ్నలపై అధికారాలు వెంటనే స్పందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అడవి భూములను రక్షించాలంటే అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సర్వే హద్దులు ఖరారు చేసి, అక్రమ కదలికలను నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story