- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్లారం ఇసుక క్వారీలో అక్రమ వసూళ్లు
జయశంకర్ జిల్లా మల్హర్ మండలం మల్లారం ఇసుక క్వారీ లో కాంట్రాక్టర్ దర్జాగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.

మల్లారం ఇసుక క్వారీలో అక్రమ వసూళ్లు
ఒక్కో లారీ నుంచి రూ.3700 వసూలు
రోడ్డు పొడుగునా బారులు తీరిన ఇసుక లారీలు
రాకపోకలకు తీవ్ర అంతరాయం
స్తంభించిన బొగ్గు లారీల రవాణా
దిశ, మల్హర్: జయశంకర్ జిల్లా మల్హర్ మండలం మల్లారం ఇసుక క్వారీ లో కాంట్రాక్టర్ దర్జాగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో లారీకి ఇసుక లోడింగ్ కోసం రూ 3700 చొప్పున ఒక్క రోజుల్లో రూ. లక్షల్లో అదనంగా సంపాదనకు తెగబడ్డారు. బుధవారం ఒక్కసారిగా వచ్చిన లారీలు నాగులమ్మ నుండి మల్లారం ఇసుక క్వారీ వరకు రోడ్డు పొడుగునా బారులు తీరడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ కారు సైతం లారీల రద్దీతో ఇరుక్కపోయింది. ఇసుక లారీల రవాణా ఒక్కసారిగా రోడ్డును బ్లాక్ చేయడంతో తాడిచెర్ల నుండి చెల్పూర్ కాకతీయ పవర్ ప్లాంట్ కు తరలిస్తున్న బొగ్గు లారీలకు సైతం రవాణా స్తంభించింది. బొగ్గు లారీలు రోజుకు దాదాపుగా 80 నుంచి 120 లారీలు అటు ఇటుగా రవాణా చేస్తూ బొగ్గు తరలించే లారీలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ లో బొగ్గు నిలువలు పెరిగిపోయాయి. మల్లారం ఇసుక క్వారీ నుంచి తాడిచర్ల నుంచి వచ్చే లారీల రాకపోకలు నిలిచిపోవడంతో మల్లారం బస్టాండ్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న కొయ్యూరు పోలీసులు రంగంలో దిగి లారీల ట్రాఫిక్ వ్యవస్థను ఎక్కడికక్కడ కట్టడి చేసి వన్ వే రూట్ క్లియర్ చేయడంతో నాగులమ్మ నుండి తాడిచెర్ల వరకు బొగ్గు లారీల రవాణాకు మార్గం చేశారు. ఇసుక క్వారీల రూల్స్ ను అతిక్రమించి ఇసుక కాంట్రాక్టర్, తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ (టీజీఎండిసి) సిబ్బంది కుమ్మక్కై ఈ అక్రమ వసూళ్ళ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది.
నాలుగు రోజుల్లో మొదటిరోజు 50, రెండవ రోజు 65, మూడవరోజు 85, నాలుగవ రోజు 120 లారీలు ఒక్కొక్క రోజుల్లో ఒక్కొక్క విధంగా వస్తున్న లారీలలో ఇసుక లోడింగ్ చేసి రవాణా సాగిస్తున్నారు. కాగా నాలుగు రోజులుగా ఇసుక లోడింగ్ జరిగిన లారీల సంఖ్య దాదాపుగా 320 అయితే సుమారు రూ. 11 లక్షల 84 వేలు నాలుగు రోజుల్లోనే ఇంత అక్రమ సంపాదన సంపాదిస్తున్నారంటే అధికారుల అండదండ ఉండడం ఇసుక కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుందనేది ఇదే సాక్ష్యం. మేం ఇలానే వసూలు చేస్తాం ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకో డబ్బులు ఇస్తేనే లోడింగ్ కు లారీకి పర్మిషన్ ఇస్తాం లేదంటే రిటర్న్ పంపిస్తాం అంటూ లారీ డ్రైవర్ల పై హుకుం జారీ చేయడంతో ఎవరికి చెప్పుకోలేక రోజుల తరబడి ఇక్కడ వెయిటింగ్ చేయలేక డబ్బులు ఇయ్యక తప్పడం లేదు రూల్స్ గిల్స్ జాంతానై అంతా మా ఇష్టం అంటూ ఇసుక క్వారీ యజమానులు బలవంతంగా మా వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని లారీ డ్రైవర్లు వాపోతున్నారు. మా పేర్లు మా ఫోటోలు పేపర్లో వస్తే ఇక మా సంగతి ఇక అంతే మాకు లోడింగ్ చేయకుండా మమ్ములను ఇబ్బందులకు గురి చేస్తారని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇసుక క్వారీలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో ఇసుక కాంట్రాక్టర్ ఇష్టం సారంగా లోడింగ్ చేస్తూ జీరో దందా కొనసాగిస్తున్నారనేది కొసమెరుపు.






