ఎన్నాళ్లీ కాపలా..!.. విసుగు చెంది ధాన్యం బస్తాలకు ‘కంప కాపలా’

by Bhanu |

సన్నదాన్యం కొనుగోలులో మిల్లర్లు మీనమేషాలు లెక్కిస్తుండడంతో రబీ సీజన్ లో దాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి.

ఎన్నాళ్లీ కాపలా..!.. విసుగు చెంది ధాన్యం బస్తాలకు ‘కంప కాపలా’
X

దిశ, మంగపేట : సన్నదాన్యం కొనుగోలులో మిల్లర్లు మీనమేషాలు లెక్కిస్తుండడంతో రబీ సీజన్ లో దాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. దీంతో కల్లాల్లోని రైతుల దాన్యం నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఎండకు ఎండుతూ వర్షాలకు తడుస్తూ కాంటాలు పెట్టలేని దుస్థితి నెలకొంది. మండలంలో రైతు సేవా సహాకార సంఘం(సొసైటీ), ఇందిరా క్రాంతి పథం(ఐకెపి), మాక్స్ సొసైటీ దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంబించి రైతుల దాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఏ గ్రేడుకు సన్నాలకు రూ.2320తో పాటు ప్రభుత్వం గుర్తించిన 32 రకాల్లోని సన్నదాన్యానికి క్వింటాకు 5 వందలు బోనస్ ఇస్తున్నారు. కామన్ (దొడ్డు)రకానికి రూ.2300 చెల్లిస్తుండగా కొనుగోలు కేంద్రాల్లో కేవలం కామన్ రకం దాన్యం కాంటాలు పెట్టి మిల్లులకు పంపగా సన్న దాన్యం పండించిన దాన్యం కాంటాలు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతున్నాయి. సన్నరకం దాన్యాన్ని మిల్లర్లు కొనే క్రమంలో 5 నుండి 15 శాతం కటింగ్ పెడితేనే కొంటామంటూ దాన్యం కొనుగోలు కేంద్రాలకు అల్టిమేటం ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


నెలల తరబడి సన్నదాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉండడంతో అవి ఎండకు ఎండుతూ వానలకు తడుస్తూ కాపలాకాయలేక రైతులు అరిగోస పడుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన దాన్యం కొట్టుకునిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం సన్నదాన్యం పండించండి ప్రభుత్వ మద్దతు ధర రూ.2320 తో పాటు రూ.500 బోనస్ ఇస్తామంటూ ఆశలు కల్పించడంతో చాలా మంది రైతులు బోనస్ కోసం సన్నదాన్యం పండించడంతో నేడు కాంటాలు పెట్టక కొనుగోలు కేంద్రాల్లో దాన్యానికి కాపలా ఉండలేక దాన్యం రాశులకు కంపలను అడ్డుపెట్టి ఎదేరుచూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోని సన్నదాన్యం వెంటనే కొనుగోలు చేసి రైతులకు ప్రభుత్వ గిట్టుబాటు ధరతో పాటు బోనస్ వెంటనే చెల్లించి అన్నదాతలను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Next Story