నిలువ నీడేది.. బస్టాండ్ జాడేది

by Batti.Sumithra |

కాటారం మండల కేంద్రం నాలుగు మండలాల కూడలి నిత్యం వందలాది మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.

నిలువ నీడేది.. బస్టాండ్ జాడేది
X

దిశ, కాటారం : కాటారం మండల కేంద్రం నాలుగు మండలాల కూడలి నిత్యం వందలాది మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. కానీ నిలువ నీడేది ? బస్టాండ్ జాడేది ? దీనికి ఆర్టీసీ అధికారులు ఏం సమాధానం చెబుతారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో గతంలో నిర్మించిన బస్టాండ్లు భూ వివాదాల 'సుడి'లో కనుమరుగయ్యాయి. ఏదేమైనా ఇప్పుడు కష్టాలు పడుతున్నది ప్రయాణికులు. కాటారం మండల కేంద్రం నుంచి కరీంనగర్, కాళేశ్వరం, వరంగల్, గోదావరిఖని ప్రాంతాలకు నిత్యం పదుల సంఖ్యలో బస్సులు, వందల సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం వందలాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. అయితే నిలువ నీడలేక ఎండ, వానలకు దుకాణాల ముందు తలదాచుకోవడం తప్పడం లేదు. రద్దీ పెరిగితే రోడ్లపైనే పడిగాపులు తప్పవు.

ఎండాకాలంలో ఎన్ని తిప్పలో..

రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. కాటారం మండల కేంద్రంలో నిలువ నీడ లేక మండే ఎండలోనే ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షించాల్సిన వస్తోంది. తలదాచుకునేందుకు నీడ లేక, తాగడానికి నీరు లేక ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. మరోవైపు కాలకృత్యాలకు దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. దీనికి తోడు మండలాల్లో ప్రయాణికులకు ఎలాంటి సదుపాయాలు లేక మండుటెండలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రవాణా చార్జీలు పెంచి వసూలు చేస్తున్న ఆర్టీసీ సౌకర్యాల కల్పన పై నిర్లక్ష్యం చేస్తుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.

అధికారులకు పట్టింపేదీ..

కాటారం మండల కేంద్రంలో మూడు దశాబ్దాల క్రితమే ఒకటి చాలదన్నట్లు రెండు బస్టాండ్లు నిర్మించారు. మంథని రహదారి మార్గంలో ఒకటి.. మహాదేవపూర్ వెళ్లే మార్గంలో( ప్రభుత్వాసుపత్రి సమీపంలో) మరొకటి నిర్మించినా ఏళ్ల తరబడిగా వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో శిథిలావస్థకు కూడా చేరాయి. ఈ నేపథ్యంలో బస్టాండ్ ల కోసం భూములు ఇచ్చిన వారే తిరిగి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయడంతో వివాదాలు న్యాయస్థానాల దాకా వెళ్లాయి. కాటారంలో ధరలు పెరిగిన క్రమంలోనే ఇలా జరిగిందన్నది ప్రచారంలో ఉంది.

కాటారం మండల కేంద్రంలో ఇదీ పరిస్థితి..

కాటారం మండల కేంద్రం నుంచి మారుమూల ప్రాంతాల్లో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రజలు నిత్యం వందల సంఖ్యలో వివిధ పనులు, ఆసుపత్రులు, నిత్యావసర సరుకులు, సామగ్రి కొనుగోలు కోసం కాటారం మండల కేంద్రానికి వస్తుంటారు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలో బస్టాండ్లు లేక ఎండలోనే ప్రయాణికులు గంటల తరబడి బస్సువచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.

Next Story