బుల్లెట్ బైకుల శబ్దం పై హనుమకొండ ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తత..

by Bhanu |

నగరంలో వాహనాల శబ్ద కాలుష్యం ప్రజల శాంతియుత జీవనాన్ని భంగం చేస్తుండటంతో, హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బుల్లెట్ బైకుల శబ్దం పై హనుమకొండ ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తత..
X

దిశ, హనుమకొండ : నగరంలో వాహనాల శబ్ద కాలుష్యం ప్రజల శాంతియుత జీవనాన్ని భంగం చేస్తుండటంతో, హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా బుల్లెట్ బైకుల మళ్లీ పెరుగుతున్న వాడకంతో, వీటి మోతతో నగరమంతా కంపించిపోతోందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో అధిక శబ్దంతో వీరవిహారం చేసే బైకర్లు ప్రజల నిద్రకు భంగం కలిగిస్తున్నారని ట్రాఫిక్ శాఖ తెలిపింది.


బైకుల ఒరిజినల్ సైలెన్సర్లను తొలగించి, శబ్దం ఎక్కువగా చేసే ప్రత్యేక సైలెన్సర్లను అమర్చడం జరుగుతోందని పేర్కొన్నారు. ఇది మోటారు వాహనాల చట్టం - 1988 యొక్క సెక్షన్ 190(2) ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని గుర్తు చేశారు. ఈ శబ్ద కాలుష్యం పసిపిల్లలు, వృద్ధులు, రోగులు తదితర వయోవర్గాలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. ఇప్పటికే ఒత్తిడితో కూడిన నగర జీవితం ఇలాంటి శబ్దాలతో మరింత కఠినతరం అవుతోందని అధికారులు అన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు ఈ సమస్యను ప్రాధాన్యతగా తీసుకోవాలని, శబ్ద నియంత్రణకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, శబ్దాన్ని అతి మేర పెంచే వాహనాలను ఉపయోగించి ఇతరులకు అసౌకర్యం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



Next Story