ఉపాధి హామీ కూలీల‌కు త‌ప్ప‌ని ఇబ్బందులు

by Ratna Kumari |

వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్‌ కింద ఉపాధి కూలీల హాజరు నమోదు కోసం ప్రభుత్వం కొత్త సాఫ్ట్ వేర్ ప్ర‌వేశ‌పెట్టింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న‌ట్టు నర్సింహులపేట గ్రామంలోని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధి హామీ కూలీల‌కు త‌ప్ప‌ని ఇబ్బందులు
X

దిశ‌, న‌ర్సింహులపేట : వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్‌ కింద కూలీల హాజరు నమోదు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త సాఫ్ట్ వేర్ కారణంగా కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న‌ట్టు నర్సింహులపేట గ్రామంలోని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని స్థలానికి ఈసీ సుమయా ఫర్హీన్, కార్యదర్శి వెంకటేశ్వర్లు వచ్చి పరిశీలించగా.. గతంలో మేట్లు హాజరు నమోదు చేయడంతో పనులు సజావుగా సాగేవని, ప్రస్తుతం మొబైల్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాలని నిబంధన తీసుకురావడంతో గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు ఎదురవుతున్నాయని కూలీలు చెబుతున్నారు. నెట్‌వర్క్ లేకపోవడం వల్ల చాలాసార్లు హాజరు నమోదు కాకపోవడంతో పని చేసిన రోజులకు కూడా వేతనాలు రావడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నర్సింహులపేట గ్రామంలో ఉదయం పని ప్రారంభించే ముందు, మధ్యాహ్నం పని ముగిసిన తర్వాత ఫోటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉండటం వల్ల కూలీలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వారు తెలిపారు. దీంతో పని సమయం కూడా వృథా అవుతుందని కూలీలు అంటున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా హాజరు నమోదు కాకపోవడం వల్ల వేతనాలు ఆలస్యం అవుతున్నాయని, ప్రభుత్వం ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉపాధి హామీ కార్మికులు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని పాత విధానంలోనే హాజరు నమోదు చేసే విధానాన్ని కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story