రైతులను రాజులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

by Nallavelli.Anjaneyulu |

రాష్ట్రంలో పలు రకాల పంటలు పండిస్తున్న రైతులను రాజులు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతుందని, రైతులు పంట మార్పిడి చేసుకొని పలు రకాల పంటలను పండిస్తే అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు.

రైతులను రాజులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో పలు రకాల పంటలు పండిస్తున్న రైతులను రాజులు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతుందని, రైతులు పంట మార్పిడి చేసుకొని పలు రకాల పంటలను పండిస్తే అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా సన్న వడ్లను పండించిన రైతులకు మద్దతు ధర ఇవ్వడమే కాకుండా క్వింటాలు వరి ధాన్యానికి ఐదు వందల రూపాయల అదనపు బోనస్ ఇచ్చి రైతులను ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేశామని అన్నారు. గురువారం ములుగు జిల్లా గోవిందరావుపేటలోని పీసీఆర్ గార్డెన్స్ లో జిల్లా స్థాయి కిసాన్ మేళా, సాంకేతిక సదస్సు జిల్లా కలెక్టర్ బోర్కేడే హేమంత్ సహదేవరావు అధ్యక్షతన జరుగగా మంత్రితో పాటు ఆయిల్ ఫైడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు ఉచిత కరెంట్ అందించగా నేడు రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తుందని వివరించారు.

గతంలో ఎన్నడు లేని విధంగా ఎక్కువ మొత్తంలో అధిక ధాన్యం పండినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుకు మద్దతు ధర అందించి నిలువ చేసిందని, రైతులు ప్రతిసారి ఒకే పంటను వేయకుండా పలు రకాల పంటలు పండించి ఆదాయం పొందాలని సూచించారు. దేశానికి రైతులే వెన్నెముకని, రైతు లేకపోతే ఆహార కొరత ఏర్పడి ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని అన్నారు. రానున్న వ్యవసాయ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎరువులు, విత్తనాల కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. ప్రస్తుత కాలంలో ఆయిల్ ఫామ్ పంటకు అధిక ప్రాధాన్యత ఉందని, ఖర్చు తక్కువ ఎక్కువ లాభంతో ఉండే ఈ పంటను రైతులు పండించాలని సూచించారు. పలు రకాల పంటలను పండించిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మార్క్ ఫెడ్ రాష్ట్ర అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని, అవగాహన లేకుండా కొందరు రైతులు ఇష్టానుసారంగా ఫర్టిలైజర్, ఎరువులు వాడటం వల్ల భూమి బలహీనత పడుతున్నదని అన్నారు. ఇప్పటికైనా ప్రతి రైతు పంట మార్పిడి చేసుకుని పంటలు పండించాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ బానోతు రవిచందర్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్, ఉధ్యన శాఖ అధికారి సంజీవరావు, ఆత్మ చైర్మన్లు కొండం రవీందర్ రెడ్డి, కర్ల అరుణ పాల్గొన్నారు.

Next Story