రైతుకు గిట్టుబాటు ధ‌ర ప్ర‌భుత్వ బాధ్య‌త : ఎమ్మెల్యే నాగ‌రాజు

by Ratna Kumari |

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పరిధిలోని దమ్మన్నపేట గ్రామంలో ఐకేపీ మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు ప్రారంభించారు.

రైతుకు గిట్టుబాటు ధ‌ర ప్ర‌భుత్వ బాధ్య‌త :  ఎమ్మెల్యే నాగ‌రాజు
X

దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పరిధిలోని దమ్మన్నపేట గ్రామంలో ఐకేపీ మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యానికి గిట్టుబాటు ధర లభించేలా ప్రజా ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. మధ్యవర్తుల మోసాలకు గురికాకుండా, నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్మితే సరైన ధరతో పాటు తక్షణ చెల్లింపులు అందుతాయని పేర్కొన్నారు.


రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతును ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామీణ మహిళలు ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల నిర్వహణలో కీలక పాత్ర పోషించడం అభినందనీయమని కొనియాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ మరియు సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఐకేపీ మహిళా సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story