జోరుగా పోడు భూముల సాగు? బీడుగా మారుతున్న అడవులు

by Ajay Maddhiboyina |

భూపాలపల్లి జిల్లాలో అటవీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కొందరు రైతులు పోడుపేరిట చెట్లను నరికివేసి అడవులను ఆక్రమించుకుంటున్నారు. దీంతో క్రమేపి జిల్లాలోని అటవీ విస్తీర్ణం తగ్గిపోతుంది. అడవుల సమీప గ్రామాల్లోని రైతులు యేటా అటవీ భూములను ఆక్రమిస్తూ చదునుచేసి సాగుచేస్తున్నారు.

జోరుగా పోడు భూముల సాగు? బీడుగా మారుతున్న అడవులు
X

భూపాలపల్లి జిల్లాలో అటవీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కొందరు రైతులు పోడుపేరిట చెట్లను నరికివేసి అడవులను ఆక్రమించుకుంటున్నారు. దీంతో క్రమేపి జిల్లాలోని అటవీ విస్తీర్ణం తగ్గిపోతుంది. అడవుల సమీప గ్రామాల్లోని రైతులు యేటా అటవీ భూములను ఆక్రమిస్తూ చదునుచేసి సాగుచేస్తున్నారు. పోడు భూములకు గతంలో పట్టాలు మంజూరుచేయడంతో ఆక్రమణల పర్వం ఎక్కువైంది. రెండుమూడేళ్ల నుంచి అడవులను ఆక్రమించి పంటలు సాగుచేస్తున్నా అటవీశాఖ అధికారులు ఏమీచేయలేని దుస్థితి. పలుమార్లు అడ్డుకోబోతే దాడులు చేపట్టిన ఘటనలు ఉన్నాయి. మరి కొందరు అటవీ అధికారులే ఎకరానికి రూ.50వేల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేసి అటవీభూములను కట్టబెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు అడవుల చుట్టూ కంచెవేసి పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

–దిశ భూపాలపల్లి ప్రతినిధి

దిశ భూపాలపల్లి ప్రతినిధి: పోడు భూముల సాగు జోరుగా సాగుతోంది. అటవీ భూములు బీడు భూములుగా మారిపోతున్నాయి. క్రమంగా అటవీ సంపద అంతరించిపోతుంది. అటవీ భూములను ఆక్రమించుకోవడంతో విస్తీర్ణం తగ్గే అవకాశాలు ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలోని అటవీ శాఖ పరిధిలో అటవీ ప్రాంతాన్నికి దగ్గరగా ఉన్న పల్లెవాసులు తమ నివాసాలకు పక్కన ఉన్న అడవిని నరికివేసి ఆ భూములను స్వాధీనం చేసుకుని పంటలు పండిస్తున్నారు. 2004 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వైఎస్​రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే గిరిజనులు, గిరిజనేతరులకు వారి ఆధీనంలోనే ఉన్న పోడు భూములకు హక్కు కల్పిస్తూ వారికి పట్టాలు పంపిణీ చేశారు. 2004 ముందు పోడు భూములను సాగు చేస్తున్న రైతాంగానికి అందరికీ వైఎస్​భూమిపై హక్కు కల్పించడంతోపాటు పట్టాలు ఇప్పించారు. ఆ సమయంలో కొంతమంది రైతులకు పట్టాలు ఇవ్వడంలో సాంకేతిక సమస్య రావడంతో అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు మిగిలిన రైతులకు భూమిపై హక్కు కల్పించి పోడు భూములకు రైతు బంధు అందేలా చేశారు. ఇదే అదునుగా భావించిన చాలామంది రైతులు రెండు మూడేళ్ల నుంచి అడవిని నరికివేసి అటవీ సంపదకు నిప్పు పెట్టి భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రతీ సంవత్సరం భూపాలపల్లి జిల్లా పరిధిలోని హాజంనగర్, పెగడపల్లి ,కాటారం, పలిమెల మాహదేవపూర్ రేంజ్ పరిధిలోని అటవీభూములకు నిప్పు పెట్టి ట్రాక్టర్లతో దున్ని వందలాది ఎకరాలు ఆక్రమించుకుంటున్నారు.

అటవీశాఖ అధికారుల చర్యలు శూన్యం..

ప్రతీయేడాది పోడుభూముల సాగు జరుగుతున్నప్పటికీ అటవీశాఖ అధికారులు ఏం చేయలేకపోతున్నారు. అడవులను నరికి బీడు భూములుగా మార్చొద్దని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అటవీ భూముల ఆక్రమణను అడ్డుకుంటే అటవీశాఖ అధికారులపై దాడులు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది అటవీశాఖ సిబ్బంది పోడు భూములు కొట్టేందుకు సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎకరానికి రూ.50వేల నుంచి లక్ష వరకు డబ్బులు వసూలు చేసున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది పల్లెవాసులు సాగు చేసుకునే విధంగా ఏర్పాటు చేసి ఎకరానికి రూ.3లక్షలనుంచి రూ.5లక్షల వరకు కొంతమందికి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. లక్షలాది విలువైన భూమి అన్యాక్రాంతం అయినప్పటికీ అటవీ శాఖ అధికారులు దాడులు భయంతో ఏం చేయని పరిస్థితి ఏర్పడింది.

అటవీ భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి..

అటవీశాఖ భూములకు సరిహద్దు రాళ్లు వేసి దానికి హద్దులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమ స్వాధీనంలో ఉన్న భూమికి హద్దులు లేకపోవడంతో సమీప రైతులు అటవీశాఖ భూములను ఆక్రమించుకుంటున్నారు. అటవీ భూమి చుట్టూ కంచే వేసి భూమిని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రతి సంవత్సరం మొక్కలు నాటుతున్నప్పటికీ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అటవీ భూములకు కంచె ఏర్పాటు చేస్తే తప్ప ఆక్రమణలు తగ్గే అవకాశాలు లేవు.

Next Story