వరదలకు కారణమవుతోన్న అధికారులు.. కోట్లు ఖర్చుచేసినా ఫలితం శూన్యం

by Naga Rani Yarlagadda |

గ్రేటర్ వరంగల్ పరిధిలో వరద నీరు మళ్లింపునకు ప్రతి యేడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం లేకుండాపోతుంది.

వరదలకు కారణమవుతోన్న అధికారులు.. కోట్లు ఖర్చుచేసినా ఫలితం శూన్యం
X

దిశ, వరంగల్ బ్యూరో: గ్రేటర్ వరంగల్ పరిధిలో వరద నీరు మళ్లింపునకు ప్రతి యేడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం లేకుండాపోతుంది. డ్రైనేజీ, వరద కాల్వల నిర్మాణాలు పూర్తికాక పోవడంతో భారీ వర్షాల సమయంలో వరదలు ఇళ్లను ముంచెత్తుతున్నాయి. రోడ్లన్నీ జలమయం అవుతుండగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెరువు శిఖం భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు వరద నీటి మళ్లింపునకు చర్యలు తీసుకోకపోవడంతో పలు కాలనీలు నీట మునిగి ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా పనులు జరగకపోవడం వర్షాకాలంలో అధికారులు, నేతలు హడావిడి చేయడంతో ఫలితం లేకుండా పోతుంది.

యేటా తప్పని ముంపు ముప్పు..

గ్రేటర్ వరంగల్ నగరం కొన్నేళ్లుగా వరద ముంపును ఎదుర్కొంటుంది. వరంగల్ నగరం పరిధిలోని చెరువులు, కుంటలు కనుమరుగు కావడం, వాగులు, నాలాలపై నిర్మాణాలు చేపట్టడంతో వర్షాలు పడిన సమయంలో సమీప కాలనీలకు వరదనీరు చేరుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వరద వెళ్లేందుకు సరైన నాలాలు, కాల్వలు లేకపోవడంతో కాలనీలను ముంచెత్తున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలో భారీ వర్షాలు పడితే కాలనీలన్నీ నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ నగర కార్పొరేషన్ గ్రేటర్ వరంగల్ గా మారిన తర్వాత శివారు గ్రామాలు ఎక్కువగా కార్పొరేషన్ పరిధిలో విలీనమయ్యాయి. భారీగా నిర్మాణాలు పెరిగాయి. పెద్ద పెద్ద నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు డ్రైనేజీల నిర్మాణాలు మాత్రం పట్టించుకోలేదు. వరదనీటి మళ్లింపునకు సరైన చర్యలు చేపట్టలేదు. చెరువుల వెంట, వాగుల వెంట నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు వరద నీటి మల్లింపున కు శాశ్వత నిర్మాణాలు చేపట్టకపోవడంతో ప్రతియేడు ఇబ్బందులు తప్పడం లేదు.

కాలనీలను ముంచెత్తుతున్న వరద..

గ్రేటర్ వరంగల్ నగరం పరిధిలో ఈ యేడు కూడా భారీ వర్షాలకు పలు కాలనీలు జలమయమయ్యాయి. గడిచిన వారం రోజులుగా పడుతున్న వర్షాలతో వరద నీరు రావడం తో పలు కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల లెక్కల ప్రకారం నగరంలోని 30కి పైగా కాలనీలను వరద ముంచెత్తింది. ఇప్పటికి కొన్ని కాలనీల్లో వరద నీరు ఇంకా పోలేదు. భారీ వర్షాల సమయంలో శివారు చెరువులు నిండి మత్తడిపడడంతో వరద నీళ్ళు వెళ్లే కాలువలు లేకపోవడం సమీప కాలనీల్లోని ఇండ్లు, రోడ్లపైకి వరద చేరుతుంది.

గతేడాది రూ.75కోట్లతో పనులు..

గ్రేటర్ వరంగల్ నగరం పరిధిలో వరద నీటిని మళ్లించేందుకు రూ.75కోట్లతో పనులను గతేడాది చేపట్టారు. వరంగల్ లోని శివనగర్ నుంచి పోతన నగర్ వరకు నీటిని మళ్లించేందుకు ఈ పనులను చేపట్టారు. అండర్ గ్రౌండ్ నిర్మాణాలు చేపట్టి వరద నీళ్లు వెళ్లే విధంగా పనులు చేపట్టారు. వర్షాకాలం ఆరంభంలోపే పనులు పూర్తికావాల్సి ఉన్నా నేటికీ పూర్తి కాలేదు. గ్రేటర్ లో శివారు గ్రామాలు విలీనం కావడంతో నిర్మాణాలు భారీగా పెరిగాయి. బహుళ అంతస్తుల భవనాలు వచ్చాయి. వీటికి అనుమతులు ఇచ్చిన అధికారులు వరద, డ్రైనేజీ నీటి మల్లింపుపై దృష్టి పెట్టకపోవడంతో వర్షాకాలంలో సమస్యలు తలెత్తున్నాయి. ఐదేళ్ల క్రితం 2021లో వరంగల్ నగరంలో భారీ వరదలు రావడంతో వందకు పైగా కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలో పలు కాలనీలు నీట మునిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టకపోవడంతో ముంపు తప్పడం లేదు.

వరద మళ్లింపుపై దృష్టిపెట్టాలి..

గ్రేటర్ వరంగల్ పరిధిలో వరద ముంపు కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం, నీటి సరఫరా, చెరువులు, కుంటల పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది నవంబర్ లో రూ.4,170 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతులను మంజూరు చేసింది. పనులను చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో పాటు వాటికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు అందించాలని కోరింది. ప్రభుత్వం ఈ పనులకు అనుమతులు ఇచ్చి 10 నెలలు పూర్తికావస్తున్నా ఇప్పటి వరకు మాత్రం ఇంకా చర్యలు తీసుకోలేదు. డ్రైనేజీ, వరద నీటి మల్లింపు కోసం శాశ్వత ప్రణాళిక రూపొందించలేదు. పనులు చేపట్టలేదు. వరద నీటి మల్లింపుపై దృష్టి పెట్టి పనులు చేపడితే ప్రజలకు మేలు జరుగనుంది. నగర ప్రజలకు వరద ముప్పు తప్పనుంది.

శాఖల మధ్య సమన్వయం లేదు..

వరంగల్ నగరంలో ప్రతీయేడు వరదలు ముంచెత్తుతున్నా శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పనులు పూర్తి కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇళ్ల నిర్మాణం, రిజిస్ట్రేషన్ సమయంలో టౌన్ ప్లానింగ్, మున్సిపల్ ఇంజినీరింగ్, కూడా, నీటిపారుదలశాఖ, రెవెన్యూ తో పాటు ఇతర శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపంతో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నట్లు తెలుస్తోంది. చెరువులు, కుంటల పరిధిలో అనుమతులు ఇచ్చిన అధికారులు వరద నీళ్ల మల్లింపుపై దృష్టి పెట్టకపోవడంతో నే సమస్యలు ఎదురవుతున్నాయి.

Next Story