- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుట్టగొడుగుల్ల వెలుస్తున్న ఫర్టిలైజర్ షాపులు
ప్రతి ఏటా కోట్ల రూపాయల నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు.

దిశ, తాడ్వాయి : ప్రతి ఏటా కోట్ల రూపాయల నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ కీలక సమయంలో అర్హత లేని వ్యక్తులు నిర్వహిస్తున్న ఫర్టిలైజర్ షాపులు,అలాగే లేబుల్ లేని నకిలీ ఎరువుల విక్రయాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సరైన నిఘా కొరవడటంతో నకిలీ ఎరువులు యథేచ్ఛగా మార్కెట్ లోకి వస్తుండటం,వాటిని కొనుగోలు చేసి నష్టపోతామేమోనని రైతులు భయపడుతున్నారు. అనేక చోట్ల వ్యవసాయంపై సరైన అవగాహన లేని వ్యక్తులు ఫర్టిలైజర్ షాపులను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఫర్టిలైజర్ షాపు నిర్వహించేందుకు కొందరు అధికారులను మేనేజ్ చేసి సర్టిఫికెట్లు దొడ్డి దారిన సంపాదించుకొని దర్జాగా షాపులను నడిపిస్తున్నట్లు..?ఆరోపణలు సైతం వెలువెత్తుతున్నాయి.వీరు రైతులకు సరైన సలహాలు ఇవ్వకపోవడం,దేవుడెరుగు అధిక ధరలు రైతుల దగ్గర వసూలు చేస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు. పంటలకు అవసరమైన ఎరువులకు బదులుగా నాసిరకం లేదా అధిక ధరలకు ఎరువులను అంటగట్టడం వంటివి చేస్తున్నారు. కొన్నిచోట్ల లైసెన్సులు లేకుండానే షాపులు నడుపుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.
మార్కెట్లో లేబుల్ లేని ఎరువులు రాజ్యమేలుతున్నాయి.వీటిపై ఉత్పత్తిదారుల వివరాలు,కూర్పు,గడువు తేదీ వంటి కీలక సమాచారం ఉండదు.దీనివల్ల రైతులు మోసపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.ఇలాంటి ఎరువులను వాడటం వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లి దిగుబడులు తగ్గిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. నకిలీ ఎరువుల వాడకం వల్ల భూసారం దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జిల్లాలోకి అక్రమ మార్గాల్లో నకిలీ మందులు
అధికారులు,వ్యవసాయ నిపుణుల కళ్ళుగప్పి మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్ వంటి సరిహద్దు రాష్ట్రాల నుంచి నాసిరకం పురుగుమందులు జిల్లాలోకి అక్రమ మార్గాల్లో ప్రవేశిస్తున్నాయి.ముఖ్యంగా రాత్రి వేళల్లో సరిహద్దు చెక్‌పోస్టులను దాటి,మారుమూల గ్రామాలకు వీటిని తరలిస్తున్నారు.స్థానిక ఏజెంట్లు, కొంతమంది వ్యాపారులు ఈ ముఠాలతో చేతులు కలిపి, రైతులను మోసం చేస్తున్నారు.పేరుపొందిన కంపెనీల లేబుళ్ళను నకిలీ సీసాలపై అతికించి, అడ్డగోలుగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.తక్కువ ధరకే లభిస్తుండటంతో,రైతులు కూడా వీటిని కొనుగోలు చేసి నిండా మునుగుతున్నారు.
లక్షాధికారులావుతున్న నకిలీ వ్యాపారులు
నకిలీ మందుల వ్యాపారం అక్రమంగా సాగుతున్నప్పటికీ, ఇదొక లాభసాటి వ్యాపారంగా మారింది.క్వింటాలుకు కేవలం కొన్ని వందల రూపాయలకు కొనుగోలు చేసే నాసిరకం మందులను,కొన్ని వేల రూపాయలకు అమ్ముకుంటూ వ్యాపారులు లక్షల్లో, కోట్లలో లాభాలు గడిస్తున్నారు.ఇంకొందరు అయితే ఏకంగా సబ్ డీలర్ గా అవతారం ఎత్తి నకిలీ మందులను సిండికేట్ గా ఏర్పడి ఫర్టిలైజర్ షాపులకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో డీలర్ నెలకు లక్షల్లో టర్నోవర్ చేస్తున్నట్లు సమాచారం.పెద్ద డీలర్ల నుంచి చిన్న దుకాణాలకు,అక్కడి నుంచి గ్రామాల్లోని ఏజెంట్లకు ఈ నకిలీ మందులు చేరి,చివరికి అమాయక రైతు చేతికి చేరుతున్నాయి.
నిఘా ఏది...?
అర్హత లేని షాపులు పుట్టగొడుగుల్లా జిల్లాను దాటి మండలం,గ్రామాల్లోకి ప్రవేశించాయి.దింతో నకిలీ ఎరువులపై వ్యవసాయ శాఖ అధికారుల నిఘా కొరవడిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.క్షేత్రస్థాయిలో తనిఖీలు తూ తూ మంత్రంగా తనిఖీలు చేపట్టడం,నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాలతో నకిలీ దందా పెరిగిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పంటలు వేసేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో నకిలీ ఎరువుల బెడద తమకు మరింత భారాన్ని మోపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- లైసెన్స్ ఉన్న,నమ్మకమైన ఫర్టిలైజర్ షాపుల్లోనే ఎరువులు కొనాలి.
- ఎరువుల బస్తాలపై తయారీదారు వివరాలు,రసాయన కూర్పు,గడువు తేదీ వంటివి ఉన్నాయో లేదో చూసుకోవాలి.
- ఎరువులు కొన్న ప్రతిసారి ఖచ్చితంగా రశీదు తీసుకోవాలి.ఇది భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే ఆధారంగా ఉపయోగపడుతుంది.
- నకిలీ ఎరువులు లేదా అనుమానాస్పద విక్రయాలు కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.






