ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి : ఏఐఎస్ఎఫ్

by Nallavelli.Anjaneyulu |

విద్యార్థులు, తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు వుట్కూరి ప్రణీత్ గౌడ్ అన్నారు.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి : ఏఐఎస్ఎఫ్
X

దిశ, ఎల్కతుర్తి : విద్యార్థులు, తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు వుట్కూరి ప్రణీత్ గౌడ్ అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) కార్యాలయంలో పలు విద్యా సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. ఎంఈఓ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బంది సురేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఊట్కూరి ప్రణీత్ గౌడ్ మాట్లాడుతూ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఫీజుల నియంత్రణ చర్యలు ఇప్పటివరకు అమలులోకి రాకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు యథేచ్ఛగా 20 నుండి 30 శాతం వరకు ఫీజులను పెంచుతూ, విద్యను వ్యాపారంగా మార్చుతున్నాయని విమర్శించారు. పేద, మధ్యతరగతి మరియు బడుగు బలహీన వర్గాల కుటుంబాలు తమ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని విద్య కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.


కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు నిర్దిష్ట షూ, టై, బెల్ట్, పాఠ్యపుస్తకాలు, ఇతర విద్యా సామగ్రిని ఒకే చోట కొనుగోలు చేయాలని ఒత్తిడి తెచ్చి, తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని తెలిపారు. ఇటువంటి చర్యలు విద్యా నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ సంబంధిత అధికార యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థలు కనీస మౌలిక సదుపాయాలు లేకుండానే కొనసాగుతున్నాయని, ఫైర్ సేఫ్టీ, భవన భద్రత, వెంటిలేషన్, విద్యార్థుల సంఖ్యకు అనుగుణమైన మరుగుదొడ్లు, అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం వంటి అంశాల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే గుర్తింపు (Recognition), అవసరమైన అనుమతులు మరియు నిబంధనలను పాటించకుండా నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చిర్ర సాయిచందు, జిల్లా కోశాధికారి పెండ్యాల బండి, మండల నాయకులు శ్రీపతి రామ్ చరణ్, బుర్ర సుశాంత్, రావుల సిద్ధు పాల్గొన్నారు.

Next Story