సౌర విద్యుత్ పథకాలతో రైతులు ఆర్థికంగా లాభపడాలి

by Ratna Kumari |

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక (99 డేస్ యాక్షన్ ప్లాన్)లో భాగంగా నిర్వహిస్తున్న “రైతు వారం” కార్యక్రమంలో గురువారం ఫోర్ట్ వరంగల్ మండలంలోని ఈస్ట్ ఫోర్ట్‌లో రైతు అవగాహన సమావేశం ఘనంగా నిర్వహించారు.

సౌర విద్యుత్ పథకాలతో రైతులు ఆర్థికంగా లాభపడాలి
X

దిశ, వరంగల్ బ్యూరో : ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక (99 డేస్ యాక్షన్ ప్లాన్)లో భాగంగా నిర్వహిస్తున్న “రైతు వారం” కార్యక్రమంలో గురువారం ఫోర్ట్ వరంగల్ మండలంలోని ఈస్ట్ ఫోర్ట్‌లో రైతు అవగాహన సమావేశం ఘనంగా నిర్వహించారు. విద్యుత్ శాఖ- వరంగల్ వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం కుసుమ, పీఎం సూర్యఘర్ పథకాల ద్వారా రైతులు సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించుకుని ఆర్థికంగా లాభపడాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ వ్యయం తగ్గడమే కాకుండా అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసి రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. సౌర విద్యుత్ వినియోగం పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రైతులు మరియు వినియోగదారుల కోసం రూపొందించిన విద్యుత్ భద్రత అవగాహన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.


విద్యుత్ ప్రమాదాల నివారణలో భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరిస్తూ.. విద్యుత్ లైన్ల సమీపంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, విద్యుత్ పరికరాలను సురక్షితంగా వినియోగించాలని సూచించారు. పథకాల అమలు విధానం, సౌర వ్యవసాయ పంపుసెట్ల ప్రయోజనాలు, విద్యుత్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యుత్ భద్రత సేవలపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి కె. అనురాధ, మండల వ్యవసాయ అధికారి జి. విజ్ఞాన్, డా. శ్రావణ్, డా. హరి, వరంగల్ సీనియర్ సైంటిస్టులు రైతులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. అధిక లాభాలనిచ్చే ఆయిల్ పామ్ సాగు, పంట మార్పిడి విధానాలు, నానో యూరియా వినియోగం, ఎరువుల సమతుల్య యాజమాన్యం, పారాక్వాట్ వంటి నిషేధిత మందుల దుష్ప్రభావాలు, వరి కోతల అనంతరం వ్యర్థాలను తగులబెట్టకుండా భూమిలోనే కుళ్ళింపజేసే పద్ధతులు, సన్న రకపు వరి సాగు మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎంపీడీసీఎల్ ఆనందం, అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, రెడ్కో జనరల్ మేనేజర్ రాజేందర్, ఎన్పీడీసీఎల్ ఎస్సీ వరంగల్ ఆనందం, జెడి అగ్రికల్చర్ అనురాధ, డి ఇ వరంగల్ మల్లికార్జున్, వరంగల్ కిషోర్, ఫోర్ట్ వరంగల్ రామకృష్ణ, విద్యుత్ శాఖ అధికారులు, రైతులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Next Story