రైతులకు వల వేస్తున్న నకిలీ విత్తన మాఫియా.. మార్కెట్లోకి ప్రమాదకర 'బీటీ-3'..?

by Ramesh Naini |

పర్యావరణానికి, భూసారానికి తీవ్ర నష్టం కలిగించే నిషేధిత ‘బీటీ-3’ (హెచ్‌టీబీటీ) పత్తి విత్తనాలను అంటగట్టి రైతుల జేబులు గుల్ల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

రైతులకు వల వేస్తున్న నకిలీ విత్తన మాఫియా.. మార్కెట్లోకి ప్రమాదకర బీటీ-3..?
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : నకిలీ విత్తన దళారులు మళ్లీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. పర్యావరణానికి, భూసారానికి తీవ్ర నష్టం కలిగించే నిషేధిత ‘బీటీ-3’ (హెచ్‌టీబీటీ) పత్తి విత్తనాలను అంటగట్టి రైతుల జేబులు గుల్ల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తుండటంతో, వచ్చే నెల నుంచి పల్లెల్లో విచ్చలవిడిగా ఈ నకిలీ విత్తనాలను విక్రయించేందుకు ఏజెంట్ల నెట్‌వర్క్ చకచకా ఏర్పాట్లు చేసుకుంటోంది.

రసాయనాల మోజు.. తగ్గుతున్న భూసారం

ఒకప్పుడు సేంద్రియ ఎరువులతో సాగిన వ్యవసాయం.. నేడు పూర్తిగా రసాయనాలు, కలుపు మందుల చుట్టూ తిరుగుతోంది. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కేవలం అధిక దిగుబడే లక్ష్యంగా రైతులు విచక్షణ కోల్పోతున్నారు. కలుపు తీసే కూలీల ఖర్చు మిగులుతుందనే ఆశతో రైతులు అడ్డగోలుగా గడ్డి మందును తట్టుకునే బీటీ-3 (హెచ్‌టీబీటీ) పత్తి విత్తనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విత్తనాలు వేసి గడ్డి మందు కొడితే కలుపు మాత్రమే చనిపోయి పత్తి మొక్కకు ఏమీ కాదు. అదే సాధారణ విత్తనాలకైతే పత్తి మొక్క కూడా మాడిపోతుంది. ఈ సౌలభ్యం వల్లే రైతులు ఈ ప్రమాదకర విత్తనాల వైపు ఆకర్షితులవుతున్నారు.

అసలేంటీ బీటీ-3?

పత్తి పంటను ఆశించే శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగులను నివారించేందుకు అమెరికాకు చెందిన మోన్‌శాంటో కంపెనీ బీటీ టెక్నాలజీని (నేలలో ఉండే బాసిల్లస్ తురింజియెన్సిస్ అనే బ్యాక్టీరియా లక్షణాలతో) అభివృద్ధి చేసింది. 2002లో వచ్చిన బీటీ-1, ఆ తర్వాత వచ్చిన బీటీ-2 కొంతకాలం పురుగులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. కానీ 2012 నాటికి పురుగులు వీటిని తట్టుకునేలా మొండిగా తయారయ్యాయి. దీంతో పురుగులతో పాటు గ్లైఫోసేట్ లాంటి కలుపు మందును కూడా తట్టుకునేలా మోన్‌శాంటో ‘హెచ్‌టీబీటీ’ (బీటీ-3)ని అభివృద్ధి చేసింది. అయితే, దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తేలడంతో భారత ప్రభుత్వం దీనికి అనుమతి నిరాకరించింది. కానీ, వ్యాపార కాంక్షతో ప్రయోగాల పేరుతో దేశంలోకి ప్రవేశించిన ఈ సాంకేతికత.. స్థానిక డొల్ల కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయి, ప్రస్తుతం అక్రమ మార్గాల్లో రైతులకు చేరుతోంది.

చోద్యం చూస్తున్న అధికారులు.. మద్దతుగా పెద్దలు!

నిషేధిత బీటీ-3 విత్తనాల దందా వెనుక బడా వ్యాపారులు, అధికారంలో ఉన్న కొందరు పెద్దల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పల్లెల్లో స్థానిక వ్యాపారులనే ఏజెంట్లుగా మార్చుకుని కోట్లు దండుకునేందుకు దళారులు సిద్ధమయ్యారు. వ్యవసాయ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలు నిద్రమత్తులో ఉన్నాయి. అడపాదడపా తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ రవాణాను అడ్డుకోవడంలో నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపణలు ఉన్నాయి.

సగానికి పడిపోయిన దిగుబడి.. అల్లాడుతున్న అన్నదాత

అధికారుల నిర్లక్ష్యం, రైతుల అవగాహన రాహిత్యం వెరసి పత్తి సాగులో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రెండేళ్ల క్రితం వరకు 30 శాతంగా ఉన్న హెచ్‌టీబీటీ (బీటీ-3) వాడకం, నేడు అమాంతం 60 నుంచి 70 శాతానికి చేరుకుందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదకర విత్తనాల వాడకం వల్ల భూసారం క్షీణించి, ఎకరానికి 10 క్వింటాళ్లకు పైగా రావాల్సిన పత్తి దిగుబడి.. ఈ ఏడాది కేవలం 5 క్వింటాళ్లకే పరిమితమైందని మార్కెట్ సమాచారం. పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కి రాక రైతులు అప్పుల పాలై అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

Next Story