- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పోరుకేక’ సభతో కొత్తగూడలో ఉత్కంఠ
కొండలు, అడవులు, గిరిజన గూడెల మధ్య సాధారణంగా ప్రశాంతంగా ఉండే మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ కొత్తగూడ మండలం బుధవారం ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దిశ, కొత్తగూడ : కొండలు, అడవులు, గిరిజన గూడెల మధ్య సాధారణంగా ప్రశాంతంగా ఉండే మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ కొత్తగూడ మండలం బుధవారం ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొత్తగూడ మండల కేంద్రంలోని గుంజేడు ముసలమ్మ ప్రాంగణంలో నిర్వహించనున్న ‘ఆదివాసీ పోరుకేక’ మహాసభ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతమంతా హై అలర్ట్‌లోకి వెళ్లింది. సభకు వేలాది మంది ఆదివాసీలు తరలిరానుండగా, మరోవైపు లంబాడీ సంఘాల నిరసనల పిలుపులు, నాయకుల నిర్బంధాల ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభను ఆదివాసీ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గిరిజన హక్కులు, పోడు భూముల సమస్యలు, ఏజెన్సీ ఉద్యోగాలు, ఐటీడీఏ పరిపాలన, విద్య, ఉపాధి అవకాశాలు, రాజ్యాంగ పరిరక్షణలు వంటి అంశాలను సభలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
కొత్తగూడ వైపు జనం వెల్లువ
ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్ తదితర జిల్లాల నుంచి ఆదివాసీలు భారీ సంఖ్యలో కొత్తగూడకు తరలివస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల నుంచి వాహనాలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల ద్వారా ప్రజలు సభా ప్రాంగణానికి బయలుదేరినట్లు సమాచారం. మధ్యాహ్నానికి జనసందోహం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
లంబాడీ సంఘాల అభ్యంతరాలు
సభకు ముందు కొన్ని లంబాడీ గిరిజన సంఘాలు తమ అభ్యంతరాలను బహిరంగంగా వ్యక్తం చేశాయి. తమ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసనలు ప్రకటించాయి. కొన్ని సంఘాల నాయకులు కొత్తగూడ వైపు ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించగా, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తమయ్యారు. నాయకుల నిర్బంధాలపై కూడా ఆయా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలతో ఒకవైపు సభ, మరోవైపు నిరసనల పిలుపులు ఉండటంతో ఏజెన్సీ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
పోలీస్ కవచంలో కొత్తగూడ
సభ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 511 మంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లా ఎస్పీ, 6 మంది డీఎస్పీలు,18 మంది సీఐలు, 39 మంది ఎస్సైలు, 35 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 375 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 20 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్లు, ఇతర పోలీస్ సిబ్బంది కొత్తగూడ ప్రధాన కూడళ్లు, సభా ప్రాంగణం, బస్ స్టాండ్, ప్రవేశ మార్గాలు, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా వలయాలు ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ప్రతి కదలికను పర్యవేక్షిస్తున్నారు.
ఇంటెలిజెన్స్ అలర్ట్
సభ నేపథ్యంలో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, నిఘా విభాగాలు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న సందేశాలు, వీడియోలు, పోస్టులపై కూడా ప్రత్యేక నిఘా ఉంచారు.
షాపులు బంద్
భారీ జనసమీకరణ దృష్ట్యా మధ్యాహ్నం మూడు గంట తర్వాత వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి పోలీసులకు సహకరించాలని కొత్తగూడ ఎస్ఐ రాజ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రత కోసం ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
రాష్ట్ర దృష్టి కొత్తగూడపైనే..
భారీ సభ, వేలాదిగా ప్రజల రాక, లంబాడీ సంఘాల నిరసనల ప్రకటనలు, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు, ప్రత్యేక నిఘా చర్యలతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి కొత్తగూడపైనే నిలిచింది. సభ ప్రశాంతంగా ముగుస్తుందా? ఎలాంటి తీర్మానాలు వెలువడతాయి? పరిస్థితులు ఎలా మారతాయి? అన్న అంశాలు రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు : ఎస్పీ శబారీష్
చట్టాన్ని అతిక్రమించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటాం ఎస్పీ శబారీష్ పేర్కొన్నారు. ప్రజల భద్రతే మా లక్ష్యం. శాంతిభద్రతల పరిరక్షణే మా బాధ్యత. ప్రజాస్వామ్య కార్యక్రమాలకు సహకరిస్తాం. కానీ చట్టాన్ని అతిక్రమించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటాం. "ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే కార్యక్రమాలకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుంది. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను సహించం. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వర్గ విద్వేషాలను పెంచే చర్యలు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, అసత్య ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఎస్పీ డా. శబరీష్ స్పష్టం చేశారు.






