- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగణన ప్రతి పౌరుడి బాధ్యత అని, సమగ్ర సమాచారం దేశాభివృద్ధికి పునాది అవుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.

దిశ, జనగామ : జనగణన ప్రతి పౌరుడి బాధ్యత అని, సమగ్ర సమాచారం దేశాభివృద్ధికి పునాది అవుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శుక్రవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి నెహ్రూ పార్క్ వరకు నిర్వహించిన “జనగణన అవగాహన వాక్” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ అవగాహన వాక్‌ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జనగామ మున్సిపల్ ఛైర్ పర్సన్ కడకంచి బాలమణి, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీయ గణన ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటివరకు ఐదు వేల మంది స్వీయ నమోదు చేసుకున్నారని, ఈ సంఖ్యను మరింత పెంచేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు.
మే 11 నుంచి ఇళ్ల గణన ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఇందులో మొత్తం 34 ప్రశ్నలు ఉంటాయని చెప్పారు. ప్రజలు అందించే వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయని, ఎలాంటి భయం లేకుండా పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జనగణనపై అవగాహన పెంచేందుకు నిర్వహించిన వాక్‌లో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం సరైన వివరాలు అందించి జనగణన విజయవంతానికి సహకరించాలని కోరారు. డీసీపీ రాజ మహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. జనగణన ద్వారా ప్రభుత్వానికి ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని, సంక్షేమ పథకాల అమలుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. “మన సమాచారం - మన భవిష్యత్తు” అనే భావనతో ప్రతి ఒక్కరూ జనగణనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు గోపీరాం, వెంకన్న, డీఏఓ అంబికా సోనీ, ఉద్యానవన శాఖ అధికారి రవికాంత్, వైద్య శాఖ అధికారి మల్లికార్జున రావు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, ఐడీఓసీ సిబ్బంది, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.






