ప్రభుత్వ భూముల హాంఫట్.. గ్రేటర్ వరంగల్ పరిధిలో పెరుగుతున్న కబ్జాలు

by Ajay Maddhiboyina |

వరంగల్ నగర విస్తీర్ణం గడిచిన 40 ఏళ్లలో భారీగా పెరిగింది. గ్రేటర్ వరంగల్ చుట్టూ 30 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించింది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారిన తర్వాత నగరం పరిధిలోని భూములు ఎక్కువగా కబ్జాకు గురయ్యాయి.

ప్రభుత్వ భూముల హాంఫట్.. గ్రేటర్ వరంగల్ పరిధిలో పెరుగుతున్న కబ్జాలు
X

దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ నగర విస్తీర్ణం గడిచిన 40 ఏళ్లలో భారీగా పెరిగింది. గ్రేటర్ వరంగల్ చుట్టూ 30 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించింది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారిన తర్వాత నగరం పరిధిలోని భూములు ఎక్కువగా కబ్జాకు గురయ్యాయి. వరంగల్, కాజీపేట, హన్మకొండ పరిధిలో పదుల సంఖ్యలో గొలుసుకట్ట చెరువులు ఉండేవి. నగరం విస్తరించిన వేళ ఆ భూములకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం గజం రూ.20 వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతున్నాయి. నాలాలు, చెరువులు, శిఖం, ప్రభుత్వ, ఎస్సారెస్పీ, విశ్వవిద్యాలయం, దేవాలయ, వక్ఫ్ బోర్డు భూములు కూడా అన్యాక్రాంతమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో సర్వే చేయగా దాదాపు 30కి పైగా చెరువులు, కుంటలు నగరం పరిధిలో కనుమరుగయ్యాయి. వాగులు, నాలాల మీద భారీగా నిర్మాణాలు వెలిశాయి.

వక్ఫ్​బోర్డు భూములు..

వరంగల్, ఉర్సు శివారు పరిధిలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు అన్యాక్రాంతమయ్యాయి. బోర్డు పరిధిలో ఉన్న ఈ భూముల్లో పలు నిర్మాణాలు వెలిశాయి. వక్ఫ్ బోర్డుతో పాటు పలు సంఘాలు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుత నిర్మాణాలను నిలిపివేశారు. ఉర్సు, జాగీర్ పరిధిలోని సర్వే నెంబర్ 273, 274, 275, 276 పరిధిలో 17.5 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి. ఈ భూమి కొంతమేర అన్యాక్రాంతం కావడంతో అధికారులు నజర్ పెట్టారు. నిర్మాణాలు నిలిపి వేసి జాయింట్ సర్వే నిర్వహిస్తున్నారు. బౌండరీలను ఏర్పాటు చేసి వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడంతో పాటు మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో కబ్జాకు గురైన భూములను కూడా పరిశీలిస్తున్నారు.

దేవాలయ భూములు..

కాకతీయ కాలం నాటి భద్రకాళి చెరువు పరిధిలోని భూములను కొన్ని అన్యాక్రాంతమయ్యాయి. సర్వే నెంబర్లు మార్చి అమ్మకాలు చేశారు. పద్మాక్షమ్మ గుట్ట పరిధిలోని దేవాలయాల భూములు కూడా ఆక్రమించుకున్నారు. ఒక ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థకు సంబంధించిన నిర్మాణంలో కూడా కొంత అసైన్డ్ భూమి ఉన్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. వడ్డెపల్లి చెరువు కింద బతుకమ్మ బండ ప్రాంతంలో ప్రభుత్వ భూమి కూడా అన్యాక్రాంతం అవుతుంది. ఓ బడా కాంట్రాక్టర్, రాజకీయ నేతలు బినామీ సర్వే నెంబర్లు సృష్టించి నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులకు ఫిర్యాదులు అందడంతో తాత్కాలికంగా నిలిపివేసినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో నిలిపివేయలేదు. గోపాలపురం చెరువు ప్రాంతంలో కబ్జాలు జరిగాయి. ఇప్పటికీ కాకతీయ విశ్వవిద్యాలయంకు సంబంధించిన భూ కబ్జాలపైన చర్యలు తీసుకోలేదు. భూములను స్వాధీనం చేసుకోలేదు. భారీ నిర్మాణాలు జరగడంతో అధికారులు కూడా చర్యలు చేపట్టడం లేదు. ఎస్సారెస్పీ భూములు కూడా అన్యాక్రాంతం అయ్యాయి. క్యాంపు నుంచి చింతగట్టు ప్రాంతంలో ప్రధాన కాలువకు సంబంధించిన భూమితో పాటు క్వాటర్లకు సంబంధించిన భూమి కొంతమేర కబ్జాకు గురైంది. ఎర్రగట్టు గుట్ట ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో చుట్టూ నిర్మాణాలు వెలిశాయి.వరంగల్, ములుగు రోడ్డు ప్రాంతంలో కూడా భద్రకాళి చెరువు కింద కొన్ని భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వరంగల్ శివారు ప్రాంతంలో పేదల గుడిసెలు వెలువగా, నేతలు కూడా ఎక్కువ మొత్తంలో కబ్జాలు చేశారు.

భూముల ధరలు పెరగడంతో..

30-40 ఏళ్ల కాలంలో భూముల ధరలు పెరగడంతో పాటు కబ్జాలు చేశారు. ప్రస్తుతం ఉన్న సర్వే నెంబర్లకు అదనపు సర్వే నెంబర్లను సృష్టించి భూములను రిజిస్ట్రేషన్ చేశారు. బై నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు ఇంటి నిర్మాణాలకు మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి అనుమతులు తీసుకున్నారు. అనుమతుల ఆధారంగా ఇండ్ల నిర్మాణం చేశారు. ప్రతి చోట అధికారులు సహకరించడం, నేతలు వత్తాసు పలకడంతో ప్రభుత్వ భూములు కనిపించకుండా పోయాయి. గూగుల్ చిత్రాలతో పాటు నేషనల్ రిమోట్ ఏజెన్సీ ఛాయాచిత్రాలను పరిశీలిస్తే పదుల సంఖ్యలో కబ్జాలకు గురయ్యాయి. కొన్నిచోట్ల అధికారులు కొంతమేర కాపాడేందుకు ప్రయత్నం చేసినా నేతల ఒత్తిళ్లతో ఏమీ చేయలేకపోయారు. వినని అధికారులను బదిలీ చేయడంతో కబ్జాలు ఎక్కువగా జరిగాయి. ఇప్పటికైనా అధికారులు కబ్జాలపై దృష్టి పెడితే విలువైన ప్రభుత్వ భూములను కాపాడే అవకాశం ఉంది.

Next Story