వరంగల్ నగర పరిధిలో రెచ్చిపోతున్న కబ్జాదారులు

by Ajay Maddhiboyina |

వరంగల్ నగరం పరిధిలో జాగా కనిపిస్తే పాగావేసేస్తున్నారు. ప్రభుత్వ అసైన్డ్, చెరువులు, కుంటలు, గుట్టలు ఏ భూమైనా పర్వాలేదు నేతల పేర్లు చెప్పి అడ్డా వేస్తున్నారు. ఎక్కడికక్కడ కబ్జా చేస్తూ బౌండరీలు తిప్పుతున్నారు.

వరంగల్ నగర పరిధిలో రెచ్చిపోతున్న కబ్జాదారులు
X

దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ నగరం పరిధిలో జాగా కనిపిస్తే పాగావేసేస్తున్నారు. ప్రభుత్వ అసైన్డ్, చెరువులు, కుంటలు, గుట్టలు ఏ భూమైనా పర్వాలేదు నేతల పేర్లు చెప్పి అడ్డా వేస్తున్నారు. ఎక్కడికక్కడ కబ్జా చేస్తూ బౌండరీలు తిప్పుతున్నారు. రాత్రికి రాత్రే ఇండ్లను కట్టేస్తున్నారు. ఎక్కడైనా, ఎవరైనా ఫిర్యాదులు చేస్తే బెదిరింపులకు పాల్పడడంతో పాటు నేతల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని రిజిస్ట్రేషన్లు చేస్తూ అమ్మకాలు చేస్తున్నారు.

రూ.కోట్లలో పలుకుతున్న భూములు..

గ్రేటర్ వరంగల్ గా ఏర్పడిన తర్వాత భూముల ధరలు భారీగా పెరిగాయి. గ్రేటర్ చుట్టూరా 20 కిలోమీటర్ల వరకు భూముల ధరలు రూ.కోట్లల్లో చేరాయి. ఒకనాడు ఎకరం రూ.20లక్షలు చేయని భూములు ప్రస్తుతం రూ.2కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పలుకుతున్నాయి. గ్రేటర్ పరిధిలో భూముల ధరలు పెరిగినప్పటినుంచి భూ కబ్జాలు కూడా భారీగా పెరిగాయి. ప్రభుత్వానికి చెందిన భూములు ఎక్కడికక్కడ కబ్జాలకు గురవుతున్నాయి. వరంగల్ నగరం అభివృద్ధి చెందక ముందు వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉండేవి. కాజీపేట, హన్మకొండ, వరంగల్ నగరాలు కలిసి గ్రేటర్ గా మారిన తర్వాత కబ్జాల పర్వం ఎక్కువైంది. ప్రభుత్వ, ప్రైవేటు భూములు అని తేడా లేకుండా కబ్జాలకు పాల్పడుతున్నారు. నగరంలో గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రభుత్వానికి చెందిన చెరువు శిఖం భూములు కూడా మాయమయ్యాయి. పదుల సంఖ్యలో కుంటలు ఆనవాళ్లను కోల్పోయాయి. ఆ భూములకు పట్టాలు పుట్టించి అమ్మకాలు చేశారు. ఇప్పటికీ హన్మకొండ పరిధిలో గుట్టలు, చెరువులను కూడా వదిలిపెట్టడం లేదు. ఒడ్డపల్లి, వరంగల్ కోట, ఉర్సుతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీగా భూ ఆక్రమణలు జరిగాయి. ప్రభుత్వ భూములకు కంచెలుగా వేసిన చోట కూడా కబ్జాలు చేస్తున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూములు కూడా అక్రమాలకు గురయ్యాయి. అధికారుల లెక్కల ప్రకారం కాజీపేట, హన్మకొండ, వరంగల్, ఖిల్లా వరంగల్, హసన్​పర్తి తహసీల్దార్ కార్యాలయాల పరిధిలో సుమారు 2వేల ఎకరాలకు పైగా భూ అక్రమాలు జరిగాయి. వీటికి సహకరించిన అధికారులు కొంత మంది సస్పెండ్ కాగా మరికొంతమందిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మధ్యనే హన్మకొండలోని హంటర్ రోడ్డు సైన్స్ సెంటర్ గుట్ట కింద 964 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించారు. హద్దులు ఏర్పాటు చేసుకొని తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయాన్ని అక్కడ ఉన్న కాలనీవాసులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో అధికారులు నిర్మాణాలను నిలిపివేశారు. చుట్టూ హద్దులు ఏర్పాటు చేయడంతో పాటు బోర్డులను ఏర్పాటు చేశారు. ఖిలా వరంగల్ తహసీల్దార్ పరిధిలో వారం క్రితం కోట దగ్గరలో ఇదే రీతిలో రెండు ఎకరాల వరకు కబ్జా చేయగా అక్కడి తహసీల్దార్ స్వాధీనం చేసుకున్నారు.

నేతల కనుసన్నల్లో కబ్జాలు..

నగర పరిధిలో ప్రతి రోజూ ఏదోఒక చోట ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ అధికార పార్టీ నేతల పేర్లు చెప్పి కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్డుకునేందుకు కాలనీవాసులతో పాటు అధికారులు వస్తే బెదిరింపులకు దిగుతున్నారు. సదరు నేతలతో మాట్లాడిస్తున్నారు. కొన్నిచోట్ల అధికారులు ఫోన్ కాల్స్ ను పట్టించుకోకుండా కబ్జాలు నిలిపివేస్తుండగా మరికొన్ని చోట్ల చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. వరంగల్ నగరం పరిధిలో అధికారులు లెక్కలు తేల్చిన భూములను కూడా ఇప్పటికి పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోలేదు. ఈ అక్రమాలు ఎక్కువగా జరగడం చెరువులు, కుంటల్లో భవనాల నిర్మాణం కావడంతో వర్షాల సమయంలో నీటమునుగుతున్నాయి. నగరం పరిధిలో కబ్జా అవుతున్న భూములపై నజర్ పెట్టి కాపాడితే భవిష్యత్​లో అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడే అవకాశం ఉంది.

Next Story