- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షణికావేశంలో వృద్ధుడి హత్య..!
నాచినపల్లి గ్రామంలో ఓ వృద్ధుడు హత్యకు శుక్రవారం రాత్రి గురైన ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది.

దిశ, నర్సంపేట: మండలంలోని నాచినపల్లి గ్రామంలో ఓ వృద్ధుడు హత్యకు శుక్రవారం రాత్రి గురైన ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముస్కుల సాంబరెడ్డి ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఆయన ఇంటికి వచ్చిన సమయంలో ఆరోగ్య కారణాలతో బట్టల్లోనే మలవిసర్జన చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన తమ్ముడి కుమారుడు ముస్కుల రాజిరెడ్డి "నీకు ఎవరు సేవలు చేయాలి" అంటూ వాగ్వాదానికి దిగినట్లు, అనంతరం క్షణికావేశంలో కర్రతో దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ దాడిలో సాంబరెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
కేసు నమోదు...
ఘటన అనంతరం శనివారం ఉదయం తాను కొట్టిన దెబ్బలకు సాంబరెడ్డి మృతి చెందాడని నిర్దారించుకుంటున్న రాజిరెడ్డి మృతదేహాన్ని ఇంటి స్థలంలోనే పూడ్చిపెట్టేందుకు నిందితుడు ప్రయత్నించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇందుకోసం ఇంటి సమీపంలో గుంత తవ్వుతుండగా అనుమానం వచ్చిన స్థానికులు అడ్డుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. "నేనే చంపాను.. నా ఇంటి స్థలంలోనే పూడ్చిపెడతాను" అని నిందితుడు చెప్పినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై రావుల రణధీర్ రెడ్డి తెలిపారు. హత్యకు గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.






