ఢిల్లీలో నిరసనలు.. పాకిస్తాన్ సోషల్ మీడియా అకౌంట్లపై ఢిల్లీ పోలీస్ నిఘా

by Malleboina Mahesh |

పాకిస్థాన్ నుంచి నిర్వహిస్తున్న కొన్ని సోషల్ మీడియా ఖాతాలు నకిలీ కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నాయని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ వెల్లడించారు.

ఢిల్లీలో నిరసనలు.. పాకిస్తాన్ సోషల్ మీడియా అకౌంట్లపై ఢిల్లీ పోలీస్ నిఘా
X

దిశ, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీ సహా.. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ నిరసనలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ నుంచి నిర్వహిస్తున్న కొన్ని సోషల్ మీడియా ఖాతాలు నకిలీ కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నాయని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ వెల్లడించారు. సంబంధిత కేంద్ర ఏజెన్సీలతో కలిసి ఢిల్లీ పోలీసులు జరిపిన ఉమ్మడి తనిఖీల్లో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏఐ (AI) ద్వారా రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలు, ఎడిట్ చేసిన ఫోటోలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్న 400 కంటే ఎక్కువ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను గుర్తించి ఇప్పటికే బ్లాక్ చేసినట్లు ఆయన తెలిపారు.

అలాగే 'ఆపరేషన్ సింధూర్' సమయంలో కూడా ఇలాంటి కొన్ని ఖాతాలు నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో చురుగ్గా వ్యవహరించాయని డీసీపీ స్పష్టం చేశారు. పలువురు సీనియర్ పోలీసు అధికారుల అధికారిక ప్రకటనలను ఎడిట్ చేయడంతో పాటు, విజువల్ కంటెంట్‌ను మార్చేసి ప్రజలను, ఆందోళనకారులను తప్పుదోవ పట్టించేందుకు ఈ విదేశీ హ్యాండిల్స్ ప్రయత్నించాయని తెలిపారు. ఇటువంటి కుట్రలను ఛేదించేందుకు మిగతా అనుమానాస్పద ఖాతాలను గుర్తించే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నామని ఢిల్లీ పోలీసు యంత్రాంగం స్పష్టం చేసింది.

Next Story