పెండింగ్ వేతనాలు చెల్లించాలి.. ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు

by Jakkula.Mamatha |

ప్రతినెల మొదటి వారంలో రావాల్సిన వేతనాలు అందక పోవడంతో కుటుంబ పోషణ భారమై అప్పులపాలు కావాల్సి వస్తోందని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెండింగ్ వేతనాలు చెల్లించాలి.. ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు
X

దిశ,​తాడ్వాయి: ప్రతినెల మొదటి వారంలో రావాల్సిన వేతనాలు అందక పోవడంతో కుటుంబ పోషణ భారమై అప్పులపాలు కావాల్సి వస్తోందని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాడ్వాయి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధి హామీ పథకం కింద విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు శనివారం నేటి సమీక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఎంపీడీఓ భారత్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా, అలాగే ప్రస్తుత నెలతో కలుపుకుని మొత్తం మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

వేతనాలు రాకపోయినప్పటికీ, ఇందిరమ్మ ఇళ్ల ఫోటో క్యాప్చర్, అటాచ్‌మెంట్, వనమహోత్సవం తదితర పనులను నిరంతరం నిర్వర్తిస్తున్నామని చెప్పారు. ​ఈ సమస్య పై సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినా ఎలాంటి స్పందన లేకపోవడంతో, విధిలేని పరిస్థితుల్లో నిరసనలో భాగంగా నేటి ఉపాధి హామీ సమీక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేసి, తమను ఆదుకోవాలని వారు ఉన్నతాధికారులను కోరారు. ​ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రమేష్, కార్యదర్శి సంతోష్, కోశాధికారి సాయన్న, సంజీవరెడ్డి, చిరంజీవి, బాలరాజు, రంజిత్, హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story