వేగంగా మారుతున్న ఢిల్లీ రాజకీయం.. మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలకు హైకమాండ్ పిలుపు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-25 10:33:16  IST  )

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.

వేగంగా మారుతున్న ఢిల్లీ రాజకీయం.. మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలకు హైకమాండ్ పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. నీట్ (NEET-UG) ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలు, విద్యావ్యవస్థ సంస్కరణలపై జంతర్ మంతర్ సహా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు సీజేపీ నేతృత్వంలో చేపట్టిన తీవ్ర నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదావికి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. నీట్ పరిణామాలపై దేశంలో చెలరేగిన ఆందోళనల దృష్ట్యా, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన్ స్పష్టం చేశారు. ఈ ఆందోళనలను విద్రోహ శక్తులు లేదా స్వార్థ ప్రయోజనాలు ఆశించేవారు దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతోనే పక్కకు తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, రానున్న కాలంలో ఇలాంటి లీకేజీలు జరగకుండా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఏర్పాటు చేసేలా కఠినమైన యాంటీ-పేపర్ లీక్ చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా సన్నాహాలు చేస్తోంది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామం కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులకే కాక, ఇతర రాష్ట్రాల రాజకీయాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే బిజెపి అధిష్టానం అత్యవసర పిలుపు మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే సహా పలువురు కీలక నేతలు హుటాహుటిన ఢిల్లీకి చేరుకుంటున్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వేగవంతం కానుందనే ప్రచారంతో పాటు, వివిధ రాష్ట్రాల రాజకీయ వ్యూహాలు, మిత్రపక్షాల సర్దుబాట్లపై చర్చించేందుకే ఈ అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆయనతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని అధిష్టానం పెద్దల వరుస భేటీలతో ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Next Story