- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పది మందితో మొదలై 42కి చేరిన విద్యార్థుల సంఖ్య.. గిరిజన పాఠశాల రూపురేఖలు మార్చిన టీచర్
ఒకప్పుడు పదిమంది విద్యార్థులతోనే కొనసాగిన ప్రభుత్వ పాఠశాల.. ఇప్పుడు 42 మంది విద్యార్థులతో కళకళలాడుతోంది.

దిశ, కొత్తగూడెం: ఒకప్పుడు పదిమంది విద్యార్థులతోనే కొనసాగిన ప్రభుత్వ పాఠశాల.. ఇప్పుడు 42 మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. పాఠశాలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచుతూ, పిల్లలను బడిబాట పట్టిస్తూ ప్రభుత్వ పాఠశాల స్థితిగతులను మార్చేందుకు ఓ ఉపాధ్యాయురాలు చేసిన కృషి సత్ఫలితాలను ఇస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని ఎంపీపీఎస్ మాయాబజార్(చండ్రుకుంట) పాఠశాలలో ఈ మార్పు చోటుచేసుకుంది.గిరిజన రిహాబిలిటేషన్ ప్రాంతానికి సమీపంలో ఉన్న చండ్రుకుంట, గడ్డిగుట్ట, జగ్గారం గ్రామాల్లో ప్రధానంగా గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా గతంలో ఈ ప్రాంతంలోని పిల్లల విద్య పై తల్లిదండ్రుల్లో ఆశించిన స్థాయిలో అవగాహన ఉండేది కాదు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కూడా తక్కువగానే ఉండేది.
ఇంటింటికీ వెళ్లి.. తల్లిదండ్రులతో మాట్లాడి
పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో ఉపాధ్యాయురాలు కిరణ్మయి ప్రత్యేకంగా దృష్టి సారించారు. పాఠశాల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ బడికి వెళ్లాల్సిన వయసున్న పిల్లలను గుర్తించారు. వారి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన బోధనతో పాటు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు.కేవలం విద్యార్థులను చేర్పించడమే కాకుండా.. పిల్లలను పాఠశాలకు పంపడం వల్ల కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించి వారిలో అవగాహన కల్పించారు. గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ పాఠశాల అభివృద్ధికి సహకారం తీసుకున్నారు.
10 నుంచి 42కు.. పెరిగిన విద్యార్థుల సంఖ్య
ఉపాధ్యాయురాలు కిరణ్ చేపట్టిన నిరంతర కృషి ఫలితంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక దశలో కేవలం 10 మంది విద్యార్థులతో ఉన్న పాఠశాల ప్రస్తుతం 42 మంది విద్యార్థులతో కొనసాగుతోంది. దీంతో పాఠశాల ఆవరణలో విద్యార్థుల సందడి పెరగడంతో పాటు తల్లిదండ్రుల్లోనూ ప్రభుత్వ పాఠశాల పై విశ్వాసం పెరిగింది.గిరిజన ప్రాంతాల్లో విద్యను ప్రతి ఇంటికీ చేరువ చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రయత్నం.. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు దోహదపడుతోంది. విద్యార్థుల నమోదు పెంచడంతో పాటు పాఠశాలపై సమాజంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలుస్తోంది.
ఒక్కరి చొరవ.. పాఠశాలకు కొత్త ఊపిరి
పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు సమిష్టిగా కృషి చేస్తే ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఎదగగలవని చంద్రుకుంట పాఠశాల నిరూపిస్తోంది. విద్యార్థుల సంఖ్య పెరగడం కేవలం గణాంకం కాదని.. గిరిజన కుటుంబాల్లో విద్య పై పెరుగుతున్న నమ్మకానికి ఇది నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు.పదిమంది విద్యార్థులతో ఉన్న పాఠశాలను 42 మంది విద్యార్థుల స్థాయికి తీసుకురావడంలో ఉపాధ్యాయురాలు కిరణ్మయి చూపిన చొరవ, పట్టుదల అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు. ఒక ఉపాధ్యాయురాలి చొరవతో ఓ ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన ఈ మార్పు.. విద్య పట్ల అంకితభావంతో పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చాటిచెబుతోంది.






