- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ రహదారి 363 పై నిర్లక్ష్య మరమ్మతులు.. ప్రమాదాలకు ఎవరు బాధ్యులు ?
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రం గుండా వెళ్లే జాతీయ రహదారి–363పై మరమ్మతు పనులు కొనసాగుతున్నప్పటికీ, పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కనీస భద్రతా చర్యలు లేకపోవడంతో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

దిశ, రెబ్బెన : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రం గుండా వెళ్లే జాతీయ రహదారి–363పై మరమ్మతు పనులు కొనసాగుతున్నప్పటికీ, పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కనీస భద్రతా చర్యలు లేకపోవడంతో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. బారికేడ్లు, రిఫ్లెక్టివ్ రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు పదిహేను రోజుల క్రితం రెబ్బెన మండల కేంద్రంలోని పల్లవి వంతెన సమీపంలో రోడ్డు మరమ్మతుల కోసం తవ్విన గుంతలో ఓ ద్విచక్ర వాహనదారుడు పడిపోయాడు.
ఈ ప్రమాదంలో అతనికి రెండు చేతులకు తీవ్ర గాయాలు కాగా, ఒక కాలు విరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇటీవల రెబ్బెనకు చేరుకుని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అదేవిధంగా శుక్రవారం వాంకిడి నుంచి వస్తున్న భార్యాభర్తలు కూడా మరమ్మతులు జరుగుతున్న ప్రాంతంలో ఎలాంటి హెచ్చరికలు లేకపోవడంతో గుంతలో పడిపోయి గాయపడ్డారు. వర్షాల కారణంగా గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో వాటి లోతు కనిపించకపోవడం, జాతీయ రహదారిపై వాహనాలు అధిక వేగంతో ప్రయాణించడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నెలలోనే రెండు ప్రమాదాలు జరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టే సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు హెచ్చరిస్తున్నారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో వెంటనే బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ రేడియం స్టిక్కర్లు, ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి, మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల వివరణ..
ఈ విషయమై మంచిర్యాల జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ అజయ్ మణి కుమార్‌ను దిశ ప్రతినిధి ఫోన్‌లో సంప్రదించగా, డాంబర్ కొరత కారణంగా రోడ్డు మరమ్మతు పనులు కొంత నెమ్మదిగా సాగుతున్నాయని తెలిపారు. డాంబర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే దిశ ప్రతినిధి రోడ్ ఇన్‌చార్జి ఇంజనీర్ సురేంద్రను సంప్రదించగా, రెండు ప్రమాదాలు జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో వెంటనే బారికేడ్లు, రిఫ్లెక్టివ్ రేడియం స్టిక్కర్లు, ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి వాహనదారుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రోడ్డు మరమ్మతు పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.






