కారు ఎక్కాలంటేనే భయమా..? టాకో ఫోబియా కావచ్చు!

by Javid Pasha |

రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడటం, భయంకరమైన ప్రమాదాలను ప్రత్యక్షంగా చూడటం వంటివి కొందరిలో టాకో ఫోబియా సమస్యకు కారణం కావచ్చు.

కారు ఎక్కాలంటేనే భయమా..? టాకో ఫోబియా కావచ్చు!
X

దిశ, ఫీచర్స్ : కొందరు ప్రయాణాలంటేనే భయపడుతుంటారు. కదులుతున్న వాహనాలు చూసి ఆందోళన చెందుతుంటారు కొందరు. బస్సు, కారు, బైకు.. ఇలా ఏ వెహికల్ ఎక్కాలన్నా భయపడుతుంటారు. ఒకవేళ వాహనంలో ఎక్కినా అవి కాస్త స్పీడ్ అందుకోగానే కంగారు పడిపోతుంటారు. దీంతో జర్నీ చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఈ విధమైన భయాన్నే మానసిక నిపుణులు స్పీడ్ ఫోబియా లేదా టాకో ఫోబియాగా పేర్కొంటున్నారు. ఇది ఎందుకు ఏర్పడుతుంది? లక్షణాలేమిటి? ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక వ్యక్తి ఆందోళన చెందడం వెనుక దానికి సంబంధించిన తీవ్రమైన పరిస్థితులు, మానసిక ఒత్తిడి, భావోద్వేగాలు కారణం కావచ్చు. టాకోఫోబియా ఆ కోవకు చెందినదే. ఉదాహరణకు ఒక వ్యక్తి బైకు మీదో, కారులోనో వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మరణించడం, తమ కళ్లముందే ప్రమాదానికి గురికావడం వంటివి చూసిన వ్యక్తుల్లో ఈ టాకోఫోబియా సంభవించే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. దీంతో బాధితులు యాక్షన్ సినిమాలు, గేమ్స్‌ వంటివి చూస్తున్నా వాటిలో దూసుకుకొచ్చే వాహనాల సన్నివేశాలు చూసి కూడా భయపడతారు. కార్లు, బస్సులు ఎక్కి ప్రయాణాలు చేయడానికైతే అస్సలు ఆసక్తి చూపరు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేసినా వీరు ఛాతీ నొప్పి, భయం, ఆందోళన, హార్ట్ రేట్ పెరగడం, వికారం, వాంతింగ్, అధిక చెమటలు పట్టడం వంటి లక్షణాలను ఎదుర్కొంటారు.

నివారణ & చికిత్స

టాకోఫోబియా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మానసిక వైద్య నిపుణులను (Psychologists / Psychiatrists) సంప్రదించాలి. వారు సమస్య వెనుక ఉన్న మూల కారణాలను గుర్తించి, సరైన చికిత్సా పద్ధతులను సూచిస్తారు. ముఖ్యంగా కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ (CBT), టాక్ థెరపీ, ఎక్స్‌పోజర్ థెరపీల ద్వారా ఆలోచనా విధానంలో మార్పులు తీసుకువచ్చి భయాన్ని శాశ్వతంగా తగ్గించవచ్చు. వీటితో పాటు మైండ్‌ఫుల్‌నెస్, శ్వాస సంబంధిత రిలాక్సేషన్ వ్యాయామాలు సాధన చేయడం వల్ల ప్రయాణ సమయంలో కలిగే ఆందోళనను సులభంగా అదుపు చేయవచ్చు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story